11 April, 2026 | 8:19 AM

ఈ వారం మూడు మెయిన్ ఐపీవోలు జారీ

16-12-2024 12:04 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈ వారం మెయిన్‌బోర్డ్ విభాగంలో మూడు ఐపీవోలు జారీఅవుతున్నాయి. రూ.179 కోట్ల సమీకరణకు మమతా మెషినరీ జారీచేస్తున్న పబ్లిక్ ఆఫర్, రూ.400 కోట్ల సేకరణకు ట్రాన్స్‌రైల్ లైటింగ్ తెస్తున్న ఆఫర్  డిసెంబర్ 19న ప్రారంభమై 23న ముగుస్తాయి. రూ.1,600 కోట్ల వెంటివ్ హాస్పిటాలిటీ ఐపీవో డిసెంబర్ 20న మొదలై 24న ముగుస్తుంది. 

మొబిక్విక్, విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్‌ల లిస్టింగ్

గతవారం ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందిన  ఫిన్‌టెక్ కంపెనీ ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్, విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోలు ఈ వారం లిస్ట్ కానున్నాయి. ఈ మూడు కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో డిసెంబర్ 18 బుధవారంనా డు లిస్టవుతాయి.   ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది.  ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఆఫర్ 119.38 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ కాగా, విశాల్ మెగామార్ట్ ఆఫర్ 27 రెట్లు, హైదరాబాద్ ఫార్మా కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ ఆఫర్ 10 రెట్లకుపైగా స్పందన పొందాయి. గురువారం ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, శుక్రవారం ఇంటర్నేషనల్ జెమ్మోలాజికల్ ఇనిస్టిట్యూట్‌లు లిస్టవుతాయి. డిజిటల్ క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్ తదితర ఫైనాన్షియల్ సేవలు అందించే మొబిక్విక్ ఐపీవోకు రూ.265 ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించగా, రిటైల్ చైన్ నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్  ఆఫర్ రూ.74 ప్రైస్‌బ్యాండ్‌తో జారీ అయ్యింది.  సాయి లైఫ్ సైన్సెస్ ఆఫర్‌ను రూ.552 ప్రైస్‌బ్యాండ్‌తో జారీచేశారు. 

ఐపీవోకు జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్

ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండ్‌నేమ్‌తో రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల విక్రయాని కి స్టోర్స్ నిర్వహిస్తున్న జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయి దా ప్రాస్పెక్టస్ సమర్పించింది. ప్రాస్పెక్టస్ వివరాల ప్రకారం ఆఫర్‌లో తాజా ఈక్విటీ షేర్ల జారీద్వారా  రూ.825 కోట్లు సమీకరించడంతో పాటు, మరో 97 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తారు. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 320 కోట్లు రుణాల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ ప్రతిపాదించింది. జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం భారత్‌తో పాటు యూఎస్, యూరప్, ఆఫ్రికా, యూఏఈల్లో విస్తరించింది.