11 April, 2026 | 6:14 AM

నడిచొచ్చే ఆరోగ్యం!

16-12-2024 12:00 AM

ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారి నడక శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అంది స్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి. ప్రతిఒక్కరూ ప్రతిరోజూ కొన్ని అడుగులు నడవాలి. ఇతర వయసుల వారితో పోలిస్తే వాకింగ్ చేయడం వల్ల సీనియర్ సిటిజన్స్‌కే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

రోగ నిరోధక వ్యవస్థ బలంగా

నడక అనేది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచ హెల్త్ సర్వేల ప్రకారం.. రోజుకు కనీసం 20 నిమిషాలపాటు నడవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా నడక రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి వ్యాధులను రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా నడిచేవారిని క్యాన్సర్ రోగాలు సైతం ఏమి చేయలేకపో యినట్టు పలు సర్వేలు చెప్తున్నాయి. 

-గుండె గట్టిగా

నడక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అరగంట  నడక వల్ల 2000 నుంచి 2500 కేలరీలు బర్న్ అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల పెద్ద వయసు వారిలో రక్తప్రసరణ క్రమబద్దీకరణ జరిగి బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నడక బరువును అదుపు చేస్తుంది. 

బరువు తగ్గేలా..

లేటు వయసులో బరువు తగ్గడం లేదా ఫిట్‌గా ఉండాలనుకునేవారు 12000 నుంచి 15000 అడుగులు వేయడానికి ప్రయత్నించాలి. బరువు తగ్గేందుకు ఉదయం 30 నిమిషాలు నడవండి. నడకను జీవితంలో భాగం చేసుకుంటే స్థూలకాయత్వం నుంచి బయటపడొచ్చు. 

షుగర్ లెవల్స్ అదుపులో

భోజనం తర్వాత కొన్నిసార్లు రక్తంలో చక్కెర పెరుగుతుంటుంది. అయితే  నడక సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల నడక భోజనాన్ని జీర్ణం చేయడానికి సహకరిస్తుంది. కండరాలను బలోపేతం చేయడంతోపాటు చక్కెర స్థాయి లను అదుపులో ఉంచుతుంది. 

మెంటల్ హెల్త్

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్యులు కచ్చితంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ నుంచి విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఆందోళనను తగ్గించి సహజమైన మానసిక స్థితిని పెంచుతాయి. అలాగే స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావర ణంలో నడిస్తే రోజంతా చురుగ్గా ఉండొచ్చు. 

72 ఏళ్ల బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని తెలియచేశాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన నడకకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. రోజుకు 35 వేల అడుగులు నడవడం తన ఆరోగ్య రహస్యం అన్నాడు. అయితే 70 ఏళ్ల తర్వాత కూడా నడక మంచిదేనని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నడవ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి ఆరోగ్య లాభాలుంటాయో తెలుసుకుందాం..

వృద్ధులు ఎంత నడవాలి?

వృద్ధులు 4000 నుండి 6000 అడుగులు నడిస్తే వారి ఆరోగ్యానికి మంచిది. వారి శారీరక సామర్థ్యానికి తగ్గట్టుగా నడవాలి.

నడకే నా ఆరోగ్య రహస్యం

ఒకప్పుడు వ్యాయామం విషయంలో కఠినంగా ఉండేవాడ్ని. కానీ మారుతున్న జీవన పరిణామాల కారణంగా మనమూ మారాలి. ప్రస్తుతం ప్రతిరోజు 35 వేల అడుగులు నడుస్తాను. వయస్సు పెరుగుతున్నకొద్దీ అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. 70 ఏళ్లలో బరువులు ఎత్తడం సాధ్యం కాదు కాబట్టి నడకను ఎంచుకోవాలి. అయితే వయసు పెరిగే కొద్దీ నడకను పెంచుకోవాలి. ఇదే నా ఆరోగ్య రహస్యం.

 శక్తి కపూర్