calender_icon.png 12 February, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ మూడు ముక్కలు

12-02-2026 12:00:00 AM

  1. అయోమయం, అస్తవ్యస్తంగా కార్పొరేషన్ల పరిధి 
  2. తగ్గుతున్న మేడ్చల్ ప్రాధాన్యం 
  3. భవిష్యత్తులో కార్పొరేషన్ల సరిహద్దు ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన?

మేడ్చల్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పోరేషన్లుగా విభజించిన క్రమంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు ముక్కలైంది. కొంత భాగం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చేర్చగా, సింహభాగం మల్కాజిగిరి కార్పొరేషన్ లో కలిపారు. మూడు పురపాలక సంఘాలు ఉన్నాయి. రెండు కార్పొరేషన్లలో చేర్చడం, మూడు మున్సిపాలిటీలు ఉండడంతో నియోజకవర్గం మూడు ముక్కలు  అయింది.

గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ లు, ఏడు మున్సిపాలిటీలు, అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం రెండు కార్పొరేషన్లలో, రెండు పురపాలక సంఘాలలో విలీనమయ్యాయి. గతంలో మున్సిపాలిటీలు గా ఉన్న మేడ్చల్, గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ కార్పొరేషన్ లో కలిపారు. షామీర్పేట మండలం తూముకుంట మున్సిపాలిటీలు మల్కాజ్గిరి కార్పొరేషన్ లో కలిపారు. కొత్తగా అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలుగా కొనసాగుతున్నాయి. అర్బన్ జిల్లాగా మారిన తర్వాత జిల్లాలో అయోమయం, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

తగ్గుతున్న మేడ్చల్ ప్రాధాన్యం 

తెలంగాణలో రాజకీయ పరంగా, భౌగోళికపరంగా మేడ్చల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అంతేగాక ఇక్కడి నుంచి గెలుపొందిన దేవేందర్ గౌడ్, ఉమా వెంకట్రాంరెడ్డి, మల్లారెడ్డి తదితరులు మంత్రులుగా పనిచేశారు. మేడ్చల్ నియోజకవర్గం ఒకప్పుడు కుతుబుల్లాపూర్ నుంచి ఉప్పల్ వరకు విస్తరించి ఉండేది.

తాలూకాలు ఉన్న సమయంలో కూడా మేడ్చల్ తాలూక విస్తీర్ణం పెద్దగా ఉండేది. కాలక్రమంగా మేడ్చల్ ప్రాధాన్యం తగ్గుతోంది. రింగ్ రోడ్డు వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్‌ఎంసి లో విలీనం చేసిన తర్వాత మేడ్చల్ జోన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో మేడ్చల్ డిసిపి ఉండగా దానిని కుతుబుల్లాపూర్ గా మార్చారు.

ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడ్చల్ సర్కిల్ కే పరిమితమైంది. మేడ్చల్ ప్రాధాన్యం తగ్గుతున్న ఒక్క నాయకుడు కూడా స్పందించడం లేదు. భవిష్యత్తులో జిల్లా పేరు మేడ్చల్ - మల్కాజిగిరి ఉండగా ఇందులో మేడ్చల్ తొలగించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. 

కార్పొరేషన్ల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన 

భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ఆధారంగానే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని రాజకీ య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేడ్చల్, షామీర్పేట్, కీసర, ఘట్కే సర్, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మే డ్చల్ సైబరాబాద్ కార్పొరేషన్ లో చేర్చగా, మిగతా ప్రాంతాలన్నీ మల్కాజిగిరి కార్పొరేషన్ లో చేర్చారు.

2028 ఎన్నికల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. 2028 లో లేదా 2033లో పునర్విభజన జరిగినా కార్పొరేషన్ల పరిధి ఆధారంగానే చేస్తారని అంటున్నారు. అలా చేస్తే పాత నియోజకవర్గంలోని మేడ్చల్ గుండ్ల పోచంపల్లి ఎల్లంపేట ప్రాంతాలు మాత్రమే మిగులుతాయి. కొత్తగా దుండిగల్ కొంపల్లి ప్రాంతా లు మేడ్చల్‌లో కలిపి అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.