౩.25 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 27(విజయక్రాంతి): చింతమానేపల్లి మండలంలోని డబ్బ గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఓ స్థావరంలో 3.25 క్వింటళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాణప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్‌కు చెందిన చాపిలె పురుషోత్తం, సిర్పూర్(టి) మండలం భూపాలపట్నానికి చెందిన బొల్లబోయిన ఆశోక్ సుమారు రూ.8.12 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
రంగంలోకి టాస్క్‌ఫోర్స్ బృందాలు: సీపీ
మంథని, మే 27 (విజయక్రాంతి): రామగుండం కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా వివిధ ప్రభుత్వశాఖలతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామని సీపీ ఎం.శ్రీనివాసులు అన్నారు. జిల్లాకేంద్రంలోని కమిషనరేట్‌లో సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు, సీసీ ఆర్బీ బుద్దె స్వామి కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
మంథని డివిజన్‌లో నకిలీ విత్త నాల విక్రయలు జరుగకుండా చూసుకునే బాధ్యత డీలర్లదేనని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. పట్టణంలో సోమవారం ఫెర్టిలైజర్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకటకృష్ణ, సందీప్ కుమార్, దివ్య, రాణి పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: జగిత్యాల డీఎస్పీ
జగిత్యాల, మే 27 (విజయ క్రాంతి): నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ హెచ్చరించారు. సోమవారం ఆయన పోలీస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జగిత్యాలలోని పలు ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్, రికార్డులను పరిశీలించారు. డీలర్లకు పలు అంశాలపై సూచనలిచ్చారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు ప్రభుత్వ లైసెన్సులు ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.






