1 August, 2026 | 5:31 AM

దేశాభివృద్ధిలో నెహ్రూ కృషి ఎనలేనిది

28-05-2024 01:21 AM

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి.. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో మాజీ ప్రధాని నెహ్రూ కృషి ఎనలేనిదని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు గుండు సూదికూడా తయారు చేసే పరిస్థితి లేదన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా అబిడ్స్‌లోని ఆయన విగ్రహానికి, గాంధీభవన్‌లో చిత్రపటానికి  నివాళుల ర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీహెచ్ మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారని, ప్రాజెక్టులు నిర్మించారని పేర్కొన్నారు.

రాజీవ్‌గాంధీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకువస్తే, మోదీ వాటిని అమ్ముకుంటున్నాడని, అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడని వీహెచ్  ఫైర్ అయ్యారు. జూన్ 5 తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. నెహ్రూ ప్రతిష్ఠను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్  ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూను విమర్శించే వాళ్లను చూసి నిజమైన దేశ భక్తులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన చెందారు.

దేశం ఈ స్థాయిలో ఉండటానికి నెహ్రూనే కారణమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.   ఆర్థిక వెనుకబాటుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తున్న బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ నేతలు అజారుద్దీన్, సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ రాజన్‌హర్పే, బెల్లయ్యనాయక్, నేరెళ్ల శారద, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. 

నెహ్రూకు  సీఎం నివాళి

మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన చిత్రపటానికి  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో  నివాళుర్పించారు. చాచాజీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతావనికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన కాంగ్రెస్.. అన్ని వర్గాల అభివృద్ధి సం కృషి చేసిందన్నారు.  కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే  శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.