calender_icon.png 19 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నాళ్ల ముచ్చట!

19-05-2025 12:00:00 AM

-కరోనా సాకుతో మూతపడ్డ కొత్త ఎస్‌ఆర్‌ఓలు

-వ్యవసాయ భూములకే పరిమితం

-డీఆర్‌ఓలో ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

మహబూబాబాద్, మే 18 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లో రెండేసి మండలాల్లో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, ఇండ్లు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఈ తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2018 మే 5న కేసముద్రం, మొగుళ్ళపల్లి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించింది. దీనితో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్లాట్లు, ఇండ్లు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లే గోస తప్పింది.

స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ప్లాట్లు, ఆస్తులు, భూముల అమ్మకాలు కొనుగోళ్ల వ్యవహారంలో కాస్త పారదర్శకంగా నిర్వహించడానికి అనువుగా మారింది. అయితే రెండేళ్ల పాటు ఆయా మండలాల్లో కొనసాగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 2020 మార్చి లో కరోనా నేపథ్యం సాకు చూపి మూసివేశారు.

కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించి మిగిలిన ఇండ్లు, ప్లాట్లు ఇతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ల సేవలను ఎత్తివేశారు. దీనితో మండలాల్లో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోయాయి. ప్రస్తుతం కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుపుతుండగా మిగిలిన ఇతర రిజిస్ట్రేషన్ ల కోసం తిరిగి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. 

ఎస్‌ఆర్‌ఓ తొలగింపుతో కొత్త చిక్కులు

రెండేళ్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో రెండేసి మండలాల్లో ఏర్పాటు చేసిన కొత్త సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వ్యవసాయేతర భూములు, ఇండ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (ఎస్‌ఆర్‌ఓ) సేవలను తొలగించడంతో అప్పట్లో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి డేటాను పూర్తిగా జిల్లా రిజిస్టార్ కార్యాలయంకు బదిలీ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి.

దీనితో కొత్త ఎస్ ఆర్ ఓ లో అప్పట్లో రిజిస్ట్రేషన్ జరిగిన లావాదేవీలకు సంబంధించి ధ్రువపత్రాలు, ఈసీ, సర్టిఫైడ్ కాపీ కావాలంటే ఆన్లైన్ ద్వారా లభించడం లేదని చెబుతున్నారు. ఫలితంగా తాము అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రాలతో జిల్లా రిజిస్టార్ (డిఆర్) వద్దకు వెళ్లి డాటా ఆన్లైన్ అప్లోడ్ చేయించుకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అప్పట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్వోలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలను ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు. 

మూసివేసిన ఎస్‌ఆర్‌ఓలను మళ్లీ ప్రారంభించాలి

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో రెండేసి చొప్పున మండలాల్లో ఏర్పాటుచేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో మళ్ళీ వ్యవసాయేతర భూములు, ఆస్తులు, ఇండ్ల క్రయవిక్ర యాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు  ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎస్ ఆర్‌ఓ ఏర్పాటు కోసం అప్పట్లోనే ప్రత్యేకం గా కార్యాలయం కేటాయించడంతో పాటు అవుట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించారు. కంప్యూటర్, స్కానర్, ఇతర సౌకర్యాలను కల్పించారు. 

జిల్లా రిజిస్టర్ కార్యాలయాల్లో ట్రాన్సాక్షన్లు తగ్గడంతో కొందరు డిఆర్‌లు ప్రభుత ్వంపై ఒత్తిడి తెచ్చి కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ఓ లను కరోనా సాకుతో ఎత్తివేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పం దించి కొత్తగా మున్సిపాలిటీగా ఆవిర్భవించిన కేసముద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాల యంలో వ్యవసాయేతర భూములు, ఇండ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.