calender_icon.png 16 September, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బిడ్డ.. నీట్ లో సత్తా..

16-09-2025 12:29:37 PM

నంగునూరు: సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండల పరిధిలోని మగ్ధూంపూర్ గ్రామానికి చెందిన బస్వరాజు అరవింద్ ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అర్హత సాధించి, తన కలని నిజం చేసుకున్నాడు. పేదరికం, కష్టాలు తన కలకి అడ్డురాలేదు అని నిరూపిస్తూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అరవింద్ పదవ తరగతిని అక్కెనపల్లి మోడల్ స్కూల్‌లో చదివి 9.3 జీపీఏతో ఉత్తీర్ణత సాధించి, సిద్దిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో 970 మార్కులతో కాలేజీలో రెండో ర్యాంక్ సాధించాడు.

చిన్నతనం నుంచి డాక్టర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివాడు. రోజువారీ దినపత్రికలు గ్రామంలో వేస్తూ.. కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కష్టపడి చదివి నీట్ పరీక్షలో అర్హత సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. మగ్ధూంపూర్ గ్రామం నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తి అరవింద్ కావడం విశేషం. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, తాను డాక్టర్ అయ్యాక పేదలకు వైద్యం అందించి సేవ చేస్తానని తెలిపాడు. అరవింద్ విజయం పట్ల అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.