06-10-2025 12:52:04 AM
-పశ్చిమ బెంగాల్‌లో కుండపోత
-డార్జిలింగ్ జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
-20 మంది ప్రజలు మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు
కోల్‌కతా/ ఖాట్మాండు/థింపు, అక్టోబర్ 5: పశ్చిమ బెంగాల్‌లో కుండపోత వర్షాలు కురస్తున్నాయి. భారీ వర్షాలకు డార్జిలింగ్ జిల్లా అతలాకుతలమైంది. జాతీయ రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. 20 మంది ప్రజలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు వారిని కాపాడి సమీప ఆసుపత్రులకు తరలించాయి. అలాగే సిలుగుడి మరిక్ మధ్య బాలసోన్ నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జి కుప్పకూలింది.
దీంతో వాహనరాకపోకలు నిలిచిపో యాయి. డార్జిలింగ్ జిల్లాతో పాటు కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి, అలీపు ర్దువార్ జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఉంది. ఆయా జిల్లాలకు అక్కడి ప్రభుత్వం రెడ్‌అలెర్ట్ ప్రకటించింది. అలాగే తీస్తా, మాల్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూ టాన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగాల్‌కు ఆకస్మిక వరదలు వచ్చాయని బెంగాల్ యంత్రాంగం ప్రకటించింది.
భూటాన్‌లో 18 మంది మృతి
భూటాన్‌లో భారీ వర్షం కురిసి నివాసప్రాంతాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. 18 మంది ప్రజలు మృతిచెందగా, పదులసంఖ్యలో గాయపడ్డారు. పలుచోట్ల నదులు ఉప్పొంగి ప్రవహించాయి. భూటాన్ రెస్క్యూ బృందాలతో పాటు భారత సైనికులు కూడా సహాయక చర్యల్లో భాగస్వా ములయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నేపాల్‌లో 51 మంది మృతి
పొరుగు దేశమైన నేపాల్‌లో కుండపోత వర్షం కురిసింది. తూర్పు నేపాల్ ప్రాంతంలోని ఇలం జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా కనిపించింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి 51 మంది పౌరులు మృతిచెందారు. పలువురు క్షతగాత్రులయ్యారు. విపత్తు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఖాట్మాండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. నేపాల్ వర్ష బీభత్సంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. సహాయక చర్యల్లో సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం
-వరుసగా ఢీకొన్న ఆరు కార్లు
-ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద ఒకదాని వెనుక ఒకటి వచ్చిన ఆరు కార్లు ఢీకొన్నాయి. అన్నింకంటే ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో దాని వెనకాలే వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రమాదానికి గురైన కార్లలో ప్రయా ణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న దారిలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఈ ఘటనతో దాదాపు 2కి.మీ.ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ణు క్లియర్ చేశారు.