10 August, 2026 | 3:47 AM

గిరిజన పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి టీఐసీసీఐ కృషి

10-08-2026 02:05 AM

12న జిల్లాలో అవగాహన సదస్సు

సిద్దిపేట క్రైం, ఆగస్టు 9 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో గిరిజన పారిశ్రామికవేత్తలకు మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిరంతరం కృషి చేస్తోందని టీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ధరావత్ తెలిపారు.

ఈ నెల 12న టీఐసీసీఐ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో నిర్వహించే అవగాహన సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. గిరిజన, లంబాడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పారిశ్రామిక పథకాలపై అవగాహన కల్పించడం, యువతలో వ్యాపార, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలను జిల్లాలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

తనపై నమ్మకం ఉంచి జిల్లా కో-ఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి భూక్య బిక్షపతి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 12న జరిగే అవగాహన సమావేశానికి జిల్లాలోని గిరిజన యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు  పాల్గొన్నారు.