12-12-2025 01:54:05 PM
రూ. 6 లక్షలు పలుకుతున్న పదవీ...
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఈ నెల 11వ తేదీన మంచిర్యాల నియోజక వర్గంలోని(Mancherial Constituency) హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలు, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలాల్లో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నాలుగు మండలాల్లో 90 గ్రామ పంచాయతీలుండగా ఆరు (దండేపల్లిలోని కొండాపూర్, కొత్తమామిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేటలతో పాటు ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలోని లింగయ్యపల్లి, లోతొర్రె) గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, గూడెం జీపీలను ఎస్టీ రిజర్వేషన్ కేటాయించగా ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే వందూరుగూడను నూతన జీపీగా మార్చడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. దీనితో 81 (లక్షెట్టిపేటలోని 18, హాజీపూర్ లోని 12, దండేపల్లిలోని 24, జన్నారంలోని 27) గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు ఎలక్షన్స్ లు నిర్వహించారు.
ఉప సర్పంచు పదవికి గట్టి పోటీ...
మంచిర్యాల జిల్లాలోని నాలుగు మండలాల్లో 816 (దండేపల్లిలో 278, హాజీపూర్ లో 106, జన్నారంలో 272, లక్షెట్టిపేటలో 160) వార్డులున్నాయి. ఇందులో 268 (దండేపల్లిలో 103, హాజీపూర్ లో 22, జన్నారంలో 111, లక్షెట్టిపేటలో 32) వార్డులు ఏకగ్రీవం కాగా 34 వార్డులకు నామినేషన్ లు దాఖలు కాకపోవడంతో 514 (దండేపల్లిలో 143, హాజీపూర్ లో 84, జన్నారంలో 159, లక్షెట్టిపేటలో 128) వార్డులకు గురు వారం ఎన్నికలు జరిగాయి. 81 గ్రామ పంచాయతీలకు శుక్ర వారం ఉదయం వరకు 73 మంది (దండేపల్లిలో 20, హాజీపూర్ లో 11, జన్నారంలో 26, లక్షెట్టిపేటలో 16) ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. మరో ఎనిమిది (దండేపల్లిలో నాలుగు, హాజీపూర్ లో ఒక, జన్నారంలో ఒక, లక్షెట్టిపేటలో రెండు) జీపీల ఉప సర్పంచులను ఎన్నుకోవాల్సి ఉంది.
లక్షలు పలుకుతున్న ఉప సర్పంచి పదవులు...
జిల్లాలోని ఉప సర్పంచు పదవుల కోసం పోటీపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలపర్చిన వార్డు సభ్యులు బల, బలాలను ప్రదర్శించుకొని కొన్ని జీపీలలో సామరస్యంగా ఎన్నిక కాగా చాలా జీపీల్లో ఉప సర్పంచు పదవికి పోటీపడ్డారు. కొన్ని జీపీల్లో ఈ పదవీ కోసం రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకు పలికింది. కొన్ని జీపీల్లో పోటాపోటీగా వార్డు సభ్యులను దగ్గర పెట్టుకోవడంతో ఉప సర్పంచుల ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కొందరేమో జీపీ అభివృద్దికి డబ్బులు ఇస్తూ వార్డు సభ్యుల ఖర్చులను చెల్లిస్తామంటున్నా ఇంకా ఫైనల్ కావడం లేదంటే ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.