‘పొగ’ సూరుతున్న జీవితాలు!
జయశంకర్ భూపాలపల్లి, మే ౩౦ (విజయక్రాంతి): సరదాగా మొదలు పెట్టే పొగ తాగడం నిండు జీవితానికి పొగ పెట్టుకోవడమే.. చుట్ట, బీడి, సిగరేట్, గుట్కా, పాన్, ఖైనీ ఏ రూపంలోనైనా పొగాకు తీవ్ర అనర్థాలకు దారి తీస్తుంది. ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతిస్తూ గుండె జబ్బులు, పక్షపాతంలాంటి ప్రాణాంతకర ముప్పును తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా చికత్స లేని రకరకాల క్యాన్సర్లకు గురిచేస్తుంది. పొగాకు నమలడం, పొగాకుతో కూడిన సిగరెట్, బీడీ మొదట హుషారుగా అనిపిస్తూ నెమ్మదిగా మత్తెక్కిస్తూ చివరకు దానికి బానిసను చేస్తుంది. వ్యసనంగా మారి ప్రాణాలను సైతం హరిస్తుంది.
పొగాకు ఉత్పత్తులతో ప్రాణాలకు హాని కల్గుతుందని తెలిసినా యువత ఆ దారిలోనే పయనిస్తున్నారు. ఎన్ని అవగాహన, చైతన్య సదస్సులు నిర్వహించినా యువతలో మార్పురావడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. పొగాకు, వాటి ఉత్పత్తులపై మొన్నటి వరకు ఊసెత్తని ప్రభుత్వం తాజాగా వాటిని నిషేధిస్తూ జీవోను విడుదల చేసింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 నుంచే ఏటా మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.
పొగతో ఊపిరితిత్తులకు ముప్పు
సిగరెట్, బీడీ నుంచి పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బన్ డై ఆక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోకి కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్థ్యం తగ్గి కణాలు విషపూరితమవుతాయి. క్రానిక్ అబస్ట్రేక్టివ్ పల్మనరి డిసీజ్ , క్రానిక్ బ్రాంకైటీస్ వంటి వ్యాధులకు దారితీసి వివిధ వైరల్,బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మెదడులో రక్తప్రసరణకు ఆటంకం
శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడు. పొగ తాగడం ద్వారా మెదడుకు ఆక్సిజన్ అందించే కెరోటిడ్ రక్తనాళాల్లో గాని, ఇతర రక్తనాళాల్లో గాని రక్తం చిక్కగా మారి మెదడుకు ప్రసరణ ఆగిపోతుంది. మెదడుకు సక్రమంగా రక్తం అందకపోతే పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఒకసారి పక్షపాతం వస్తే ఇక రోగి జీవితాంతం ఇతరులపై ఆధారపడి దుర్బర జీవితం గడుపాల్సిందే.
గుండెపోటు ప్రమాదం ఎక్కువ
సిగరేట్, బీడీ ముట్టించిన మరుక్షణం నుంచే గుండె వేగం అదుపు తప్పుతుంది. పది నిమిషాలపాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకొంటుంది. ఎంఐ స్ట్రోక్, హెచ్‌టీఎన్‌లకు దారితీసే రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదే పరిణామం గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పొగాకు ఉత్పత్తులపై సర్కారు నిషేధం
ఎట్టకేలకు ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ జీవోను విడుదల చేసింది. గత ప్రభుత్వాల హయాంలో గుట్టు చప్పుడు కాకుండా పొగాకు ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగేవి. ఒకప్పుడు పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్నా రహస్యంగా అమ్మకాలు జరిగేవి. కాగా, రాష్ట్రం ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపేలా జీవోను విడుదల చేసింది. పొగాకు ఉత్పత్తులు తయారు చేసినా అమ్మినా కొన్నా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
పొగాకు నమలడం డేంజరే
పొగాకులో ఉండే నికోటిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో ఎసిటైల్ కోలింగ్ అనే రసాయనం విడుదలై మనిషిని హుషారుగా ఉన్నట్టు చేస్తుంది. ఈ భావనతోనే పొగాకుకు అలవాటు పడుతుంటారు. పొగాకు నమిలితే నికోటిన్‌తోపాటు లెడ్ కాడ్మియంలాంటివి విడుదల అవుతాయి. ఈ హానికర పదార్థాలు ఎక్కువ అవడం వల్ల డీఎన్‌ఏ దెబ్బతింటుంది. క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.






