ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరలేదు
తెలంగాణ ఏర్పాటై పదేళ్లవుతున్నా ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు. హక్కులను హరించారు. విద్య, వైద్యం, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. వర్సిటీల్లో రెండువేల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కరోజు కూడా గత సీఎం వీసీలతో సమావేశాలు నిర్వహించలేదు. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని సమావేశ హాళ్లకు గత ప్రభుత్వం తాళం వేసింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. తెలంగాణ కోసం 15 ఏళ్లు పోరాడిన నాపై కేసులు పెట్టి 5 నెలలు జైళ్లో ఉంచారు. పాలమూరు లాంటి ప్రాంతాలకు నీళ్లు వచ్చినా.. పదేళ్లలో మద్యం అమ్మకాలు, వితంతు పెన్షన్లు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త విధానాలకు రూపకల్పన చేయాలి. ప్రొఫెసర్ కాశీం, ఉస్మానియా యూనివర్సిటీ
ఉద్యమకారులకు ఆత్మగౌరవం కావాలి
తెలంగాణ కోసం ప్రొఫెసర్ కోదండరాం, స్వామిగౌడ్ నాయకత్వంలో పోరాడాం. 1969 పోరాటంలో అమరుల స్ఫూర్తితో మలిదశ ఉద్యమాన్ని కొనసాగించాం. ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారులకు, ప్రాణాలర్పించిన పోలీసు కృష్ణయ్య లాంటి త్యాగదనులకు గుర్తింపులేదు. అమరవీరులను పక్కనబెట్టారు. రాజకీయం తెరమీదకు వచ్చింది. తెలంగాణ అస్థిత్వం పక్కకు పోయింది. పీఆర్సీ తప్ప, ఉద్యోగులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ఉద్యమకారులకు ఆర్థికసాయం కాదు, ఆత్మగౌరవం కావాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభలు సందర్భంగా తెలంగాణ ఉద్యమం, కీర్తిని చాటే పాటకు కూడా అవమానం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని భావిస్తున్నా.
ముజీబ్, టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు
అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారడానికి గత ప్రభుత్వ విధానమే కారణం. ప్రత్యేక రాష్ట్రంలో తమ బతుకులు భాగుపడుతాయని కన్న కలలు, అకాంక్షలు నేటికి నెరవేరలేవని చెప్పవచ్చు. ఎంతోమంది ఉపాధ్యాయులు ఉద్యమాన్ని బుజానికి వేసుకుని పనిచేసిన వారికి నేడు ప్రత్యేకరాష్ట్రంలో గుర్తింపు లేదు. ఉపాధ్యాయ సమస్యలు సైతం కనీసం పరిష్కారానికి నోచుకోలేవు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని చెప్పవచ్చు.
భాస్కర్, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్,
ఉపాధ్యాయ జేఏసీ మాజీ అధ్యక్షుడు అమరవీరుల కలలు నెరవేరాలి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అయిన రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్రంలో నేటికి నిరుద్యోగులకు నియమాకాలు లేకపోవడం, విద్యకు తగు ప్రాధాన్యత లేకపోవడం వంటి లోటు కన్పిస్తుంది. కేజీ టూ పీజీ అన్నా విద్యా రంగానికి కేవలం మూడు, నాలుగు శాతం మేర మాత్రమే నిధులు కేటాయించడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. వైద్య పరంగా సైతం నేటికి ముందడుగు పడటం లేదు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న కొన్ని దవాఖానలు తప్ప ఇప్పటికి పెద్ద దవాఖాన నిర్మాణం జరుగలేదు. అమర వీరులు కన్న కలలు నేటికి నెరవేరలేదు.
సిద్ధేశ్వర్, తెలంగాణ రాష్ట్ర జేఏసీ స్ట్రీరింగ్ కమిటీ సభ్యులు






