9 May, 2026 | 7:54 PM

‘స్వీట్ హోమ్’ సాధన దిశగా!

14-05-2024 12:00 AM

‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’ ప్రతి సంవత్సరం మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న తరుణంలో కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతలను గురించి తెలియజేయడానికే ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మ డి కుటుంబాలు ఉండడం లేదు. ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో విచ్చలవిడిగా బతకడం, పిల్లలకు సంస్కృతి సాంప్రదాయం తెలియచేసే తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు లేకపోవడం, క్షణికావేశంలో నేరస్తులు కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 

కుటుంబ వ్యవస్థ బలహీనమవడం మూలంగా సమాజంలో జరిగే నష్టాలను, తద్వారా సంభవించే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఐరాస (ఐక్యరాజ్యసమితి) కుటుంబ వ్యవస్థను పటిష్ఠ పరచడానికి 1993 మే 15న ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’ జరుపుకోవాలని నిర్ణయించింది. ‘కుటుంబ వ్యవస్థను కాపాడు కోవడం’ ప్రాతిపదికగా ప్రజాచైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ, కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యాన్ని వివరించడమే లక్ష్యంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. 

ఉత్తమ సంస్కారానికి వేదిక

విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి ప్రేమానురాగాలు పెంపొందింప జేయాలనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని’ ప్రకటించింది. కుటుంబ సమైక్యతపై ప్రజలందరికీ అవగాహన కలిగించడం, కుటుం బ పెద్దల నైపుణ్యాల్ని, అనుభవాలను పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఆ రోజును జరుపుకుంటున్నాం.

మన సమాజం మనకు ఇచ్చిన ఒక గొప్ప అరుదైన కానుకగా కుటుంబ వ్యవస్థను భావించవచ్చు. కుటుంబం అనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రత్యేకత కారణంగా, కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ ‘వసుధైక కుటుంబం’ అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది. సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్చే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. కుటుంబ వ్యవస్థ వల్ల సమాజానికి మనం ఇచ్చే సందేశం ఎంతో గొప్పది. ప్రపంచదేశాల్లో భారతదేశ కుటుంబ వ్యవస్థ వంటిది మరెక్కడా లేకపోవడం అనేది మన ధార్మిక జీవితం గొప్పతనంగా భావించవచ్చు.

మనం మనసున్న మనుషులం

నేటి ఆధునిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా, రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నెలకొంది. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యాభర్తలు కూడా ఒకచోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం  లేదంటే మన కుటుంబ వ్యవస్థ ఎంత బలహీన పడిందో అర్థం చేసుకోవచ్చు. అందరూ డబ్బు సంపాదించే యంత్రాలుగా మారి, తల్లిదండ్రులను చూసుకొనే తీరిక లేక వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. ఉన్న కొన్ని చిన్న ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి ఉండలేక పెళ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టుకోవడం చూస్తు న్నాం.

జంటలుగా ఉండికూడా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఒంటరై పోతున్నారు. సలహాలు సూచనలు ఇచ్చే పెద్దవారు లేక, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు రాక, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు ఉండక, జీవితమంటే విసుగు వచ్చే స్థాయికి నేటి యువత వెళ్లిందంటే కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ మరింత స్థాయిలో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యాలను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ వ్యవస్థలోని విలువలు, ముఖ్యోద్దేశాలు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, మనదైన ఉత్తమ సంస్కృతిని వారికి అందజేయడం, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం వంటివాటి దిశగా అందరం నడవాలి.

కుటుంబ పెద్దలే పెద్ద దిక్కు

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఉమ్మడి కుటుంబాలలో ఆడవారు, మగవారు వేర్వేరు పనులు పంచుకొని సమైక్య జీవనాన్ని సాగిస్తూ శ్రమ విభజనకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. ఈ ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరి నొకరు పలకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఫోన్లోనో, మొబైళ్లలోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా ఉన్నాయంటే విచారకరం. ఇప్పుడు అలాంటి ఉమ్మడి కుటుంబాలున్న వారిని వెతికినా దొరకడం లేదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత, చిన్న చిన్న కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నాం.

అలాంటి తగాదాలను కుటుంబ పెద్దలు సర్ది చెప్పి ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగించేవారు. సమన్వయం లోపించడం వల్ల విడాకులు తీసుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి, ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యాన్ని గుర్తించి వీలైనంత ఎక్కువ సమ యాన్ని మనవలు మనవరాళ్లతో గడిపే అవకాశం మన తల్లిదండ్రులకు ఇవ్వాలి. నీతి కథలు, ధార్మిక జీవనాలు, పౌరాణిక విశేషాలు చెప్పే అవకాశం వారికి కల్పించాలి. అందరూ కలిసిమెలిసి ఉంటూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలపరిచేలా చేద్దాం. గౌరవం, త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, ఓర్పు, ఒకరికొకరు సహకరించు కోవడం వంటివి సంతోషకరమైన కుటుంబానికి మార్గాలుగా భావిద్దాం. 

వ్యాసకర్త సెల్ : 99634 99282

ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ?

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, నాగరికత అభివృద్ధికి మూలమైంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. పూర్వకాలం నుండి మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నదన్న సంగతి చరిత్ర విదితమే. మన దేశంలో ఉమ్మడి కుటుంబాల వారు ఆనందంగా ఉంటున్న విషయం కూడా చారిత్రక సత్యం. ఒక కుటుంబంలో తాత, నానమ్మ లేదా అమ్మమ్మ మొదలు వారి పిల్లలు, మనవలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి.

ఇంట్లోని పెద్దలను అందరూ గౌరవిస్తూ, వారి మాటను జవదాటే వారు కాదు. ఆ కుటుంబాలలో పెద్దల సంరక్షణలో పిల్లలు ఆనందంగా ఎదిగేవారు. కష్టసుఖాలు సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపిన కుటుంబాలెన్నో ఉన్నాయి. కానీ, నేటికి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి కార్యక్రమాలు కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను దెబ్బతీశాయి.

గడప రఘుపతిరావు