9 May, 2026 | 8:51 PM

ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం

14-05-2024 12:00 AM

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ నిజంగానే పెద్ద పండగ అయిన సంక్రాంతినే మరిపించింది. సొంత ఊళ్లలో ఓటు వేసేందుకు జంట నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వెళ్లడంతో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడి పోయాయి. ఎన్ని ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా చివరి నిమిషంలో పెద్దఎత్తున జనం తరలి రావడంతో అవేవీ చాల లేదు. ప్రైవేటు బస్సులు ఇతర వాహనాలలో ప్రయాణించడానికి అవి వసూలు చేసే అలవి కాని చార్జీలు భరించలేక ఆర్టీసీ బస్సులు లేక జనం చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. 

అష్టకష్టాలు పడి గమ్యస్థానాలకు చేరుకున్న జనం ఉదయం ఆరు గంటలకే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంతో ఉదయం నుంచి భారీ క్యూలు దర్శనమిచ్చాయి.  ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం- బీజేపీ- జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉండడంతో అక్కడ ఈసారి పోలింగ్ భారీగానే ఉండవచ్చని మొదటినుంచి అందరూ భావించారు. తెలంగాణలోకూడా ఏపీతో పోటీగా భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ పండితులకు సైతం కాస్త విస్మయానికి గురి చేసింది.  అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి ఇంకా కోలుకోక పోవడంవల్ల ఆ పార్టీ పోటీ నామమాత్రంగానే ఉండవచ్చని మొదట్లో అందరూ భావించారు. కానీ, వారి అంచనాలను మించి ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.

సంక్రాంతి పర్వదినాన్ని తలపించింది

సాధారణంగా సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏపీ వాసులు, ఇతర తెలంగాణ జిల్లాల ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో నగరం బోసిపోయి కనిపించేది. ఈ సారి ఓట్ల పండగ సందర్భంగా అలాంటి వాతావరణం కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓటర్లలో ముఖ్యంగా యువ ఓటర్లలో  రాజకీయ చైతన్యం ఇంతగా వెల్లివిరియడం ఓ శుభ పరిణామం. ఫలితంగా ఈసారి ఓటింగ్ శాతం గత ఎన్నికలకంటే ఎక్కువగానే ఉండవచ్చని ఈసీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉన్న కారణంగా దాదాపు 64 శాతం పోలింగ్ జరిగింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆ శాతాన్ని దాటిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఎన్నికల్లో ఓటు వేయడానికి గల్ఫ్ దేశాలు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు ఓటు వేయడానికి స్వరాష్ట్రానికి వచ్చారంటే ఈ ఎన్నికలు ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నాయో అర్థమవుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు కూడా కుటుంబసభ్యులతో తరలివచ్చి ఓటేయడంతోపాటు ఓటు ప్రతి పౌరుడి హక్కే కాకుండా బాధ్యత అని, తప్పకుండా ఓటేయాలంటూ పిలుపుకూడా ఇచ్చారు. ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు కొండకోనల్లో మైళ్లకొద్దీ కాలి నడకన పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. 

చాలాచోట్ల ఎన్నికల పండగ వాతావరణం వెల్లివిరిసినా కొన్ని ప్రాంతాల్లో మా త్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతంగా గుర్తిం పు పొందిన పల్నాడు, నరసరావుపేట తదితర నియోజకవర్గాలుసహా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా దాదాపు 100 వరకు చెదురు ముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తక్కువేనని చెప్పాలి. ఎన్నికల కమిషన్ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుసహా పలువురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా అధికారులకు గట్టి హెచ్చరిక చేయడంతో  వారు కట్టుదిట్టంగా విధులు నిర్వహించగలిగారు. ఇందుకు ఈసీని నిజంగా అభినందించాలి. ఎన్నికలు ముగిసినందుకు  ఫలితాల కోసం వచ్చే నెల 4 దాకా ఉత్కంఠగా ఎదురు చూడక తప్పదు.