3 May, 2026 | 2:12 PM

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

01-05-2026 11:12 AM

హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శుక్రవారం లక్డీకాపూల్‌లో ఉన్న రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Director General of Police)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ విరమణ వయస్సు పూర్తి చేసుకుని ఏప్రిల్ 30న పదవి నుంచి వైదొలగిన అనంతరం, సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్  ఏప్రిల్ 28న డీజీపీగా నియమితులయ్యారు. 

ఆనంద్ గతంలో అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. అలాగే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పదవిని రెండుసార్లు నిర్వహించారు. ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా సేవలందించారు. ఆనంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి, నిజాం కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన ఆనంద్, వరంగల్‌లో ఏఎస్పీగా తన మొదటి పోస్టింగ్‌తో సర్వీస్‌లో చేరారు.

అనంతరం నిజామాబాద్‌లో తొలిసారిగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆయన తన సేవా కాలంలోని మొదటి తొమ్మిది సంవత్సరాలను నక్సల్ ప్రభావిత జిల్లాల్లో గడిపారని, అక్కడ ఆయన ఆపరేషన్లకు నాయకత్వం వహించడంతో పాటు పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లు, నక్సలిజం నిర్మూలనలో పోషించిన పాత్రకు గాను, ఆయనకు రాష్ట్రపతి శౌర్య పతకం లభించింది.