కళ్యాణం కమనీయం
వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహుని తిరు కళ్యాణం
కళ్యాణానికి పోటెత్తిన భక్త జనం
మంగపేట,ములుగు జిల్లా, (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో శ్రీహేమాచల క్షేత్రంలో( మల్లూరు గుట్ట) నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం శ్రీ లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాల నడుమ కళ్యాణ మండపంకి తీసుకువచ్చి కళ్యాణ తంతు కార్యక్రమం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.02 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో శ్రీ లక్ష్మీనృసింహస్వామికి పాణిగ్రహణం ( జీలకర్ర బెల్లం) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాంగల్య ధారణ కార్యక్రమం, ముత్యాలతో తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రి సీతక్క స్వామి వారికి సమర్పించి కళ్యాణం తిలకించారు.






