13 August, 2026 | 11:29 PM

‘హర్ ఘర్ తిరంగా’తో దేశభక్తితో ఉప్పొంగిన పట్టణం

13-08-2026 10:04 PM

మణుగూరు, ఆగష్టు 13,( విజయ క్రాంతి న్యూస్ ): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ‘వందేమాతరం’ గేయం అందించిన 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మణుగూరులో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

జాతీయ జెండాలను చేతబూని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ వీధుల్లో సాగిన ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. యువత, విద్యార్థులు ఉత్సాహంగా అడుగులు వేస్తూ “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినాదాలు చేయడంతో పట్టణం దేశభక్తితో ఉప్పొంగింది.

జాతీయ జెండా విశిష్టతను, దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్టా బిక్షపతి, రూరల్ అధ్యక్షులు ఈసాల వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షులు కామసాని వీర మధుసూదన్, న్యాయవాది రవికుమార్, మురళీమోహన్ రాజు, కుంజా రామకృష్ణ, బీరా రమేష్, ముత్యాల వెంకటేశ్వర్లు, మీసాల దుర్గారావు, మునిగేల మహేష్ తదితరులు పాల్గొన్నారు.