22 April, 2026 | 5:02 PM

కాళేశ్వరం దోషులు జైలుకు పోవడం ఖాయం

22-04-2026 03:56 PM

హైదరాబాద్: విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ను హైకోర్టు తప్ప పట్టలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కమిషన్ నివేదిక, దర్యాప్తు తీరును కోర్టు తప్పు పట్టలేదన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనేది వాస్తవం, రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందనేది కూడా వాస్తవం అన్నారు.

కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లటం ఖాయమని హెచ్చరించారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం తదుపరి చర్చలకు వెళ్తోందని మహేశ్ గౌడ్ వివరించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు గతంలో అనలేదా?, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతకు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనలేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణకు సీబీఐకి అప్పగిస్తే.. రెండ్రోజుల్లోనే దోషులను జైలులో పెడతామని కేంద్రమంత్రులు అన్నారని గుర్తుచేశారు. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిందని తెలిపారు.

సీబీఐ దర్యాప్తు కోరితే ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు, బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న లోపాయకారి ఒప్పందం వల్లే దర్యాప్తు ప్రారంభం కాలేదా?  మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు మాత్రం మూడేళ్లకే కుంగిందని ఆరోపించారు. కమీషన్లకు ఆశపడి నాణ్యతలో రాజీ పడినందుకే మేడిగడ్డ కుంగి పోయిందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరిన విధంగానే సీబీఐ దర్యాప్తునకు అప్పగించామని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదో.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.