08-01-2026 02:29:12 PM
హైదరాబాద్: గాంధీ భవన్‌లో టీపీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, ఏఐసీసీ నాయకులు ప్రవీణ్ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవ రావు, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
పురపాలక ఎన్నికలే ప్రధాన అజెండాగా నిర్వహించిన టీపీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలు, తాజా రాజకీయాలపై, వీబీజీరామ్ జీ పథకంపై చర్చించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు చేయాలని బచావో సంగ్రామ్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... వీబీజీరామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని, సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 20 నుంచి 30 వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. వీబీజీరామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామ సభలు, ఎంజీఎన్ఆర్ఈజీఏ గొప్పతనం వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డ బహిరంగ సభలు ఉంటాయన్నారు.