08-12-2025 11:05:51 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున రోడ్డు విస్తరణ పనులు స్థానిక వ్యాపారులకు గిట్టడంలేదు. రోడ్డు విస్తరణ పనులు భాగంగా సోమవారం పాత బస్టాండ్ వద్ద జేసీబీ యంత్రంతో దుకాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వ్యాపారులంతా గుమిగుడి ఆందోళనకు దిగారు. వ్యాపారులకు మున్సిపల్ అధికారులకు మధ్య కొంత సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకసారిగా పరిస్థితి అక్కడ ఉధృతంగా మారింది. వ్యాపారస్తులు జేసీబీ ముందు నిలబడి అడ్డుకున్నారు. ఎంతసేపటికి అక్కడి నుంచి వ్యాపారస్తులు కదలకపోవడంతో చేసేదేం లేక అక్కడి నుంచి మున్సిపల్ అధికారులు వెళ్లిపోయారు. దీంతో వ్యాపారస్తులు శాంతించి ఆందోళన విరమించారు.
పాత బస్టాండ్ వద్ద వ్యాపారస్తులు రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవడంతో అక్కడి నుంచి విస్తరణ పనులను నిలిపివేసిన వెళ్లిపోయిన అధికారులు మరోవైపుగా కన్నాలబస్తి నుంచి రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం గమనార్హం. రోడ్డు విస్తరణ పనుల పట్ల మొదటి నుంచి వ్యాపారస్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు తమ పనులను యధావిధిగా కొనసాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులను వ్యాపారస్తులు చివరి ప్రయత్నంగా మరోసారి అడ్డుకోవడం పట్టణంలో చర్చనీయంశంగా మారింది. రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులు క్రియాశీల ఆందోళనకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం పట్టణ వ్యాపార సముదాయాల బందుకు పిలుపునిచ్చారు. రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారస్తులు కార్యచరణ ఆందోళనకు బందుతో శ్రీకారం చుట్టనున్నారు.