01-11-2025 07:39:15 PM
చిట్యాల,(విజయక్రాంతి): తుఫాన్ ప్రభావంతో జాతీయ రహదారి చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద నీటి నిల్వతో భారీగా వానాల రద్దీ శనివారం ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద వర్షపు నీరు చేరుకొని నాలుగు రోజులుగా చెరువుని తలపిస్తూ జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే ప్రయాణికులు వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైవేపై నీటి నిల్వతో గుంతలు ఏర్పడి రైల్వే వంతెన క్రింద నుండి వాహనాలు నెమ్మదిగా కలుతుండడంతోనూ వాహనాల రద్దీ చిట్యాల నుండి పెద్దకాపర్తి వరకు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
గుంతలలో వాహనదారుల చక్రాలు అందులో ఇరుక్కుని బయటికి తీయడానికి నానా తంటాలు పడుతున్నారు. వర్షపు నీటిలో ఆటో ఇరుక్కుపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న మునుగోడు ఎస్సై ఇరుగు రవి, పోలీస్ సిబ్బంది ఆటోను తోసి బయటికి తీసారు. చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. రోడ్డుపై నీరు తొలగించకుండా రోడ్డు భద్రతను గాలికి వదిలేశారని, ట్రాఫిక్ నియంత్రణలో అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందని వాహనదారులు వాపోతున్నారు.