ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు
మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్, మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సిగ్నల్ వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు.
ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలని సూచించారు. రెడ్ సిగ్నల్ వద్ద వాహనాలను ఆపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు సురక్షితమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, ట్రాఫిక్ ఎస్.ఐ అరుణ్ కుమార్ ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






