27 March, 2026 | 11:15 AM

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

04-05-2024 01:43 AM

శిక్షణా తరగతులను వినియోగించుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్

మెదక్, మే 3 (విజయక్రాంతి) : అధికారులు శిక్షణా తరగతులు శ్రద్ధగా విని విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పీవో, ఏపీవో, పోలింగ్ సిబ్బందికి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన శిక్షణలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశానికి, విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో పీవో బుక్‌ను పొందుపర్చిన నియమావళి ప్రకారంగా విధులు నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ ఉదయం 5.30గంటల లోగా పూర్తి చేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంలు తీసుకొని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత పీవోలదే అన్నారు. ఓటరు బూత్ దగ్గర బీఎల్‌వో సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే లోపలికి రానివ్వాలన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని సాధారణ పరిశీలకుడు సమీర్‌మాధవ్ కుర్కోటి పరిశీలించారు. కార్యక్రమంలో మెదక్, తూప్రాన్ ఆర్డీవోలు రమాదేవి, జయచంద్ర, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, సైన్స్ అధికారి రాజీరెడ్డి, పోలింగ్ అధికారులు, సహాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంసీసీ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉండాలి

సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం పనితీరును జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్రమ నగదు, మద్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు, సామాజిక మాధ్యమాలలో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు మొదలైన నివేదికలను ప్రతిరోజు సకాలంలో సమర్పించాలని తెలిపారు. 

ప్రతి ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల సరళిని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పోస్టల్ బ్యాలెట్‌లో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని, ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటర్‌కు గుర్తింపు కార్డు ఉండాలన్నారు. ఫారం 13ఏ, 13బి, 13సీలను సరిచూసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి మెదక్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు కలెక్టరేట్, ఆర్డీవో కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.