27 March, 2026 | 9:30 AM

చిగురించని ఆశలు!

04-05-2024 01:48 AM

పూర్తిస్థాయిలో అమ్ముడుపోని తునికాకు యూనిట్లు

అడవి బిడ్డల ఉపాధికి గండి

ఆకు సేకరణపై నీలినీడలు

కరువు కాలంలో బతుకుదెరువుపై దెబ్బ

జయశంకర్  భూపాలపల్లి,  మే 3 (విజయక్రాంతి): అడవి బిడ్డల ఆశలు ఆవిరవు తున్నాయి. గిరిజనులు వరంగా భావించే తునికాకు సీజన్‌పై నీలినీడలు అలుముకున్నాయి. మరో వారం రోజుల్లో ఆకు సేకరణ ప్రారంభం కానుండగా యూనిట్లు అమ్ముడుపోకపోవడంతో గిరిజన బిడ్డలు దిక్కులు చూస్తున్నారు. పెట్టుబడి లేని పంటగా భావించే తునికాకు నిరుపేద కూలీలకు ఆదుకుంటుంది అనుకుంటే కాంట్రాక్టర్ల అనాసక్తి కారణంగా గిరిజనుల ఉపాధికి దెబ్బపడింది. వేలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే తునికాకు సేకరణ ఈసారి పూర్తి స్థాయిలో టెండర్లు అమ్ముడుపోక కొన్ని ప్రాంతాల్లో ఆకు సేకరణ జరిగే పరిస్థితి లేదు. ఈ ఎండాకాలం సీజన్‌లో గిరిజన కుటుంబాలు చిన్నా పెద్ద తేడా లేకుండా ఉపాధి పొందుతారు. ప్రకృతి పరంగా వచ్చే ఈ ఆదాయం ఈసారి చాలా మంది కూలీలకు దూరం కానుంది.  

35 యూనిట్లకు 16 మాత్రమే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని రెండు డివిజన్‌లలో మొత్తం 35 తునికాకు యూనిట్లు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో అటవీశాఖ ఆధ్వర్యంలో యూనిట్ల వారీగా ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు టెండర్లు పిలువగా జిల్లా వ్యాప్తంగా 16 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. భూపాలపల్లి డివిజన్‌లో 19 యూనిట్లకు 5 మాత్రమే అమ్ముడుపోగా మిగతా 14 అమ్మడుపోలేదు. మహాదేవ్‌పూర్ డివిజన్‌లో 16 యూనిట్లకు 11 మాత్రమే అమ్ము డుపోయాయి. రెండు డివిజన్లలో 35 యూనిట్లకు 16 మాత్రమే అమ్ముడయ్యా యి. మిగతా 19 యూనిట్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆ యూనిట్లలో తునికాకు సేకరణ నిలిచిపోనుంది. పెట్టబడిలేని పంటగా భావించే తునికాకు సీజన్‌లో ఏటా కూలీలు, రైతులు, వ్యవసాయేతరులు దీనిపైనే ఆధారపడతారు. ఎలాంటి పనులు లేని సమయంలో ఈ సీజన్ ఆదుకుంటుంది. సీజన్‌లో సంపాదించిన డబ్బులతో రైతులు వానకాలం సీజన్‌లో పంటలకు పెట్టబడి పెట్టుకుంటారు. చాలా మంది కూలీలకు ఈ సీజన్ ఇంటిసామగ్రి, బట్టలు, పిల్లలకు బడి ఫీజులు లాంటి అవసరాలకు ఆదుకుంటుంది. కూలీలు ఆకు సేకరణ కోసం తెల్లవా రుజామున 4 గంటల ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది అటవీ ప్రాంతానికి వెళ్లి 10 గంటల వరకు ఇంటికి చేరుకుంటారు. కొందరు కాలినడకన మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో అటవీ ప్రాంతానికి వెళ్లి ఆకు సేకరిస్తారు. ఇండ్లల్లో కుటుంబమంతా కలిసి ఆకులను పేర్చుకుని కట్టలు కట్టి సాయంత్రం వరకు కల్లాలకు వెళ్లి అమ్ముకుంటారు. ఆకు కట్టలు అమ్మిన వారం రోజుల్లోగా కాంట్రాక్టర్ల ద్వారా కల్లేదార్లు కూలీలకు డబ్బులు చెల్లిస్తారు. 

38,400 ఎస్‌బీల సేకరణ లక్ష్యం

భూపాలపల్లి జిల్లాలోని మొత్తం 35 యూనిట్లలో ఈ ఏడాది భూపాలపల్లి అటవీ డివిజన్‌లో 19 యూనిట్లకు 19,800 స్టాం డర్డ్ బ్యాగులు (ఎస్‌బీ) లక్ష్యంగా 119 కల్లాలు, మహాదేవ్‌పూర్ అటవీ డివిజన్‌లో 16 యూనిట్లలో 20,100 ఎస్‌బీ లక్ష్యంగా 112 కల్లాల ఏర్పాటుకు  అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. మొత్తంగా రెండు డివిజన్‌లలో కలిసి 38,400 స్టాండర్డ్ బ్యాగుల (ఎస్‌బీ) సేకరణ లక్ష్యంగా అధికారులు నిర్ణయించగా, 16 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో  మిగతా 19 యూనిట్లలో తునికాకు సేకరణ నిలిచిపోనుంది. 

50 ఆకుల కట్టకు  3 రూపాయలు

ఈ ఏడాది ప్రభుత్వం 50 ఆకుల తునికాకు కట్ట ధర రూ.3గా నిర్ణయించింది. ఒక్క ఎస్‌బీలో వెయ్యి తునికాకు కట్టలుంటాయి. ఈ లెక్క ప్రకారం ఒక్క ఎస్‌బీపై కూలీకి రూ.౩ వేల వరకు కాంట్రాక్టర్ చెల్లిస్తాడు. దీంతో ఒక్కో కుటుంబం ఈ సీజన్‌లో సుమారు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు సంపాదించే వీలుంది.