27 March, 2026 | 3:23 AM

విద్య, వైద్యం నిధుల్లో కోత విధించం

27-03-2026 01:15 AM
  1. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఆరోగ్యశ్రీ బకాయిలు
  2. గతంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్‌ల విషయంలో అనేక అవకతవకలు 
  3. విచారణ జరుగుతోంది.. దీని వెనుక ఎవరున్నారో తేలుతుంది
  4. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): పేదల విద్య , వైద్యానికి సం బంధించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా కోత విధించబోమని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నాణ్యమైన విద్య అం దుబాటులో లేదని, విద్య, వైద్యమే మా ప్రభుత్వ ప్రాధాన్యతలు అని వెల్లడించారు.

డిసెంబర్ 6, 2023 వరకు ఆరో గ్యశ్రీ కోసం ప్రతి నెల సగటున రూ. 52 కోట్లు ఖర్చు చేస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు సగటున రూ. 89 కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య బకాయిల వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు మూత పడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఆరోగ్యశ్రీ బకాయిలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచే మాకు వారస త్వంగా వచ్చాయని గుర్తుచేశారు. ఆ భారాన్ని మోస్తూనే రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు.

7.12 .2023 నాటికి రూ. 627 కోట్ల పెండింగ్ బకాయిలు మాకు భారంగా వచ్చాయని, 8.12.2023 రోజునే రూ. 2,408 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ కోసం చెల్లించామని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ. 927 కోట్ల, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 1,480 కోట్లు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఇంకా రూ. 727 కోట్లు ఆరోగ్య బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు  చెల్లింపులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువగా ఉ న్నాయని, అయినా ఆరోగ్యశ్రీ చెల్లింపులపైన అపోహలు కల్పిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే రోగు ల సంఖ్య పెరిగిందని చెప్పారు. గతంలో సీఎంఆర్‌ఎప్ చెక్‌ల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, కొంత మంది ఈ సహాయ నిధి దుర్వినియోగం చేశారని, ఈ స్కాంపై విచారణ జరుగుతోందని, దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు వస్తుందని తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చాక ఆన్‌లైన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చే సేలా చర్యలు తీసుకున్నామని, దీని వల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇప్ప టివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 2,046 కోట్ల రూపాయలు ఇచ్చామని, ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,400 కోట్ల ఖర్చు చేశామని వెల్లడించారు. పేదల వైద్యం కోసం 25 నెలల్లో రూ. 4,500 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.

రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేద ని, పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర సరైన డాక్టర్లు లేరన్నారు. ఆరోగ్యశ్రీ రోగులను టీచింగ్ కాలేజీలకు పంపించే ఆలోచన చేస్తున్నామని, ఆరోగ్య శ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఈ ఆస్పత్రులకు ఇస్తామని, దీని వల్ల ఆస్పత్రుల నిర్వహణ మె రుగు పడుతుందన్నారు. ఆస్పత్రుల నిర్వహణను గ్రూప్-1 అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నామని తెలిపారు.

కులగణనలో భాగంగా చేసిన జనగణన ఆధారంగా కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇంది రమ్మ జీవిత బీమా ఇవ్వబోతున్నామని, దీనివల్ల ప్రతి కుటుంబానికి ధీమా కల్పించబోతున్నామని స్పష్టంచేశారు. మనవాళ్లు వేలమంది డాక్టర్లు విదేశాల్లో పనిచేస్తున్నారని, విదేశాల్లో పనిచేసే మన డాక్టర్ల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ తయారు చేస్తున్నామని, మన ప్రాంతానికి వాళ్లు వచ్చినప్పుడు ఇక్కడ ఆస్పత్రుల్లో సేవలు అందించడానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రులను స్పెషలైజేషన్ ఆస్పత్రులుగా మారుస్తున్నామని, ఆరోగ్యశ్రీ, సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులను ఈ ఆస్పత్రులకు కేటాయిస్తామని చెప్పారు. గోషామహల్‌లో 30 ఎకరాల్లో రూ. 3000 కోట్లతో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, అదనంగా 10 వేల బెడ్‌లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.

టిమ్స్ ఆస్పత్రుల పనులు వేగంగా చేస్తున్నామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటు వస్తున్నామని స్ప ష్టం చేశారు. వైద్యంలో నిరంతరం సవాళ్లు ఎదురవుతాయని, వైద్య ఆరోగ్య శాఖ సవాల్ లాంటిద న్నారు. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తెస్తామ ని, సభ్యుల సలహాలను స్వీకరిస్తామన్నారు.