15 August, 2026 | 10:53 AM

మేడిగడ్డ బరాజ్‌లో మళ్లీ ప్రకంపనలు

25-05-2024 12:33 AM

16వ గేటు ఎత్తుతుండగా భారీ శబ్దాలు

 గేట్లు ఎత్తే ప్రయత్నాలు ఆపిన అధికారులు

 దేశవ్యాప్తంగా మరోసారి మేడిగడ్డ కలకలం

జయశంకర్ భూపాలపల్లి, మే 24(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలిమెట్టు అయిన మేడిగడ్డ లక్ష్మిబరాజ్‌లో మరోసారి ప్రకంపనలు కలకలం రేపాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నిపుణుల సూచనలతో ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థ మేడిగడ్డ బరాజ్ రక్షణ పనులను వారం రోజుల క్రితం ప్రారంభించింది. ఏడో బ్లాక్‌లోని గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తున్న క్రమంలో శుక్రవారం భారీ కుదుపుతో కూడిన శబ్దాలు రావడంతో గేట్లు ఎత్తే ప్రక్రియకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.

భారీ సైజులో ఉన్న గేట్లను ఎత్తుతున్న క్రమంలో బరాజ్ పునాదిపై ఒత్తిడి పెరిగి పిల్లర్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నట్టు సమాచారం. గతం లో వచ్చిన వరదల కారణంగా బరాజ్‌కి కింద భారీ గొయ్యి ఏర్పడిందని అధికారులు అనుమానిస్తున్నారు. గొయ్యిని పూడ్చిన అధికారులు మరోచోట గొయ్యిని గుర్తించడం గమనార్హం.  దేశవ్యాప్తంగా ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టుపై చర్చకు దారి తీసిన నేపథ్యంలో మరోసారి ప్రాజెక్టులో ప్రకంపనలు రావడం చర్చనీయాంశంగా మారింది.