15 August, 2026 | 11:31 AM

నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు

25-05-2024 12:32 AM

ఆదిలాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ బృందాల దాడులు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 

రూ.20 లక్షల విలువైన విత్తన ప్యాకెట్లు స్వాధీనం 

తాండూర్‌లోనూ దాడులు.. ఒకరి అరెస్ట్

ఆదిలాబాద్/ బెల్లంపల్లి, మే 24 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాల కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నా, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు అక్రమార్కులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. దొడ్డిదారిలో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అంటగడుతూనే ఉన్నా రు. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారి ఆటకట్టిస్తున్నారు.

శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఓ గోదాములో డీఏవో పుల్లయ్య, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేశాయి. మొత్తం 975 అనుమతులు లేని వివిధ కంపెనీల విత్తన ప్యాకెట్లు, 500 కిలోల లూజ్ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సామ అశోక్ రెడ్డి, రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులు రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు విత్తనాలను తరలించేందుకు సిద్ధమవుతుండగా పట్టుకున్నామన్నారు.

ఘటనా స్థలాన్ని ఎస్పీ గౌస్ ఆలం స్వయంగా పరిశీలించారు. అలాగే మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కొత్తపల్లిలోనూ టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేసింది. గ్రామస్తుడు ఎర్రవోతు రాజు ఓ స్థావరంలో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏపీలోని ప్రకాశం జిల్లా పున్నూర్‌కు చెందిన తిరుమలశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి నుంచి విత్తనాలు సేకరించినట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 24 (విజయక్రాంతి): కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. ఆసిఫాబాబాద్ కలెక్టరేట్‌లో శుక్రవారం విత్తనాలు, ఎరువుల డీలర్లతో ఎస్పీ సురేశ్‌కుమార్, ఏఎస్పీ ప్రభాకర్, ఇన్‌చార్జి డీఏవో క్రిష్టారెడ్డితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాటాల్డారు. నకిలీ ఎరువులు, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగు మందులు అమ్మితే సహించేది లేదన్నారు. నిర్ణీత ధరలకే విత్తనాలు విక్రయించాలన్నారు. ఎక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఏడీఏ, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

కొడంగల్‌లో తనిఖీలు..

కొడంగల్, మే 24 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం తాండూరు ఏడీఏ రుద్రమూర్తి తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిషేధిత పురుగు మందులు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. తనిఖీల్లో  ఏవో లావణ్య పాల్గొన్నారు.