13 August, 2026 | 4:04 AM

సైబర్ ఉచ్చులో చిక్కిన గిరిజనుడు

13-08-2026 12:41 AM

రూ.5 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించి దశలవారీగా నగదు వసూలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రుణం ఇప్పిస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ గిరిజనుడి నుంచి దశలవారీగా నగదు వసూలు చేసిన ఘటన తిర్యాణి మండలం మంగి గీసిగూడ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆత్రం గంగుకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి రుణం మంజూరైందని, పత్రాల ప్రక్రియ పూర్తయిందని నమ్మించారు. రూ.5 లక్షల రుణం పొందాలంటే ముందుగా బీమా కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి వసూలు చేశారు.

మొదట రూ.7,500 చెల్లించిన గంగును, అనంతరం మరిన్ని చెల్లించాలంటూ మరో రూ.16 వేలు, ఆ తర్వాత రూ.10,600 చెల్లించాలని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇలా పలుమార్లు నగదు చెల్లించిన అనంతరం సదరు వ్యక్తులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు.

రుణం వస్తుందనే ఆశతో డబ్బులు చెల్లించిన గంగు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నాడు.గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి రుణం ఇప్పిస్తామని చెప్పినప్పుడు వారి మాటలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెల్లడించకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు చూపిస్తున్నారు.