13 August, 2026 | 4:02 AM

గుంతల రోడ్డు.. ముళ్ల పొదల ముప్పు!

13-08-2026 12:41 AM

బెజ్జంకి రహదారిపై ప్రయాణికుల అవస్థలు

బెజ్జంకి, ఆగస్టు12 (విజయక్రాంతి): బెజ్జంకి మండల కేంద్రం నుంచి పోతారం మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్న చినుకు పడితే చాలు గుంతల్లో నీరు చేరి రహదారి చిత్తడిగా మారుతోంది. ఇదే రహదారికి ఇరువైపులా దట్టమైన ముళ్ల పొదలు పెరిగి రోడ్డుపైకి విస్తరించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. ఒకవైపు గుంతల రోడ్డు.. మరోవైపు రోడ్డుపైకి వచ్చిన ముళ్ల పొదలు.. ప్రయాణికులకు ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులతో పాటు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.