14-08-2025 12:16:19 AM
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
- పలు వాగులపై నుంచి రాకపోకలు నిలిపివేత
- జలమయమైన పలు కాలనీలు
- వరదలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- సాత్నాల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్
- పొచ్చర జలపాతం వద్దకు పర్యటకుల నిలిపివేత
ఆదిలాబాద్/కుమ్రం భీం అసిఫాబాద్/ బెల్లంపల్లి, ఆగస్టు13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుతున్నాయి. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా తలపిస్తున్నాయి.
మూడు రోజులపా టు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ల నేతృత్వంలో అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు అన్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టును ను బుధవారం పరిశీలించారు.
సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ప్రాజెక్టు పరిసరాలను కలకరిస్తే పరిశీలించి, ప్రస్తుత పరిస్థితి పై ఆరా తీశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని అదే విధంగా ప్రజలు పర్యాటకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
వాగులు కల్వర్టులపై నుండి ప్రవహించే ప్రాంతాలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పా టు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని వాటిని దాటకుండా ఉండాలని తెలిపారు. అదేవిధంగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తోంది. దింతో తాత్కాలిక వంతెన పై నుండి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
3 రోజుల పాటు భారీ వర్షలు కురియనున్న కారణం గా తర్నం వాగు తాత్కాలిక బ్రిడ్జి నుండి రాకపోకలను నిలిపి వేస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. జైనథ్, బేలా మండలాల తో పాటు మహారాష్ట్ర ప్రజలు ఆదిలాబాద్ కు వెళ్లాలంటే లాండసాంగి గ్రామం మీదు గా రాకపోకలు సాగించాలని అధికారులు సూచించారు. మరోవైపు బోథ్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలాంటి ప్రమాదాలు జరగకుండా బోథ్ పోలీసులు ముం దస్తు చర్యలు చేపట్టారు.
బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు పొంగి ప్రవహించ డంతో అటు వైపుగా ప్రజలు రాకుండా ఉం డేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే నక్కలవాడ గ్రామానికి వెళ్లేలో లెవల్ వంతెన పై నుండి నీరు ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిపివేశారు. ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.
అటు భారీ వర్షాలు అనే నేపథ్యంలో జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాలకు జలకళ సంతరించుకున్నాయి. జలపాతాలు సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఏర్పాటు చేపట్టారు. ముందస్తుగా పొచ్చర జలపాతం వద్దకు పర్యాటకుల అనుమతిని రద్దు చేశారు.
రామ్‌నగర్ వంతెన వద్ద..
బెల్లంపల్లి నియోజకవర్గంలో వరద ముంపునకు గురైన పలు గ్రామాలను బుధవారం కలెక్టర్ దీపక్ కుమార్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి సందర్శించారు. వర్షాల దాటికి దెబ్బతిన్న లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించా రు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు, చెరువుల వద్ద పరిస్థితిని అంచనా వేశారు.
తాండూర్ మండలంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ ప్రజలు అటువైపు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ వంతెన వద్ద వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. వెంటనే వరద సహాయక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో చేరిన పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ను పరి శీలించి ప్రమాదకర స్థాయిలో ఉన్న ఇండ్లలో ఉంటున్న వారిని ప్రభుత్వ పాఠశాలకు పునరావాసం కింద తరలించారు. గ్రామంలో బ్లీచింగ్, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భీమిని మండలంలోని చిన్న తిమ్మాపూర్ గ్రామం లో చేరిన బ్యాక్ వాటర్‌ను పరిశీలించి పునరావాస చర్యలు చేపట్టారు.
భీమిని, బిట్టురు పల్లి గ్రామాల మధ్య పూర్తిగా దెబ్బతిన్న రహదారి, కల్వర్టు లను పరిశీలించి వాటికి వెంట నే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్జి భీంపూర్ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయితీ రాజ్ రోడ్డు, వంతెన పనులను వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఏకధాటి గా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం చర్యలు తీసుకుంటుందని ముంపు గ్రామస్తులకు కలెక్టర్ చెప్పారు.
తక్షణ సహాయం అం దించడం కోసం జిల్లాలోని సమీకృత కార్యాలయ భవనంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736- 250501ను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో సహాయక చర్యలు ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. రైతులు పొలాలలో విద్యుత్తు మోటార్ల వద్ద జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. వర్షాలు కురిసే సమయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వా గులు, నదులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వంతెనల వద్దకు ఎవరు వెళ్ళవద్దని కోరారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వరద నీటి సమాచారం అందించేందుకే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
అబ్బో ఎంత పెద్ద చేప..
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 13: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కురిసిన భారీ వర్షానికి చెరువుల్లో ఎగువ ప్రాంతం నుం చి వచ్చే వరదలతో భారీ చేపలు కొట్టుకొస్తున్నాయి. మండలంలోని రాళ్ల పేట చెరువులో 16 కిలోల చేప ను కనువిందు చేసింది. మంగళవారం రాత్రి నుంచి విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు రాళ్లపేట చెరువులో వరద నీటితో కొట్టుకు వస్తున్న పెద్ద పెద్ద చేపలు రాకతో గ్రామస్తులు ఆ చెరువుకు క్యూ కట్టారు. భారీ చేపలు లభించడంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఉప్పొంగిన ప్రాణహిత
జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో గ్రామాలు,కాలనీలు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.భారీ వర్షం కురవడంతో కొమురం భీం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి 21254 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంపల్లి వాగు ఉప్పంగడంతో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తుంపెల్లి వాగును పరిశీలించగా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని పైకాజినగర్ కాలనీలను సందర్శించారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి రెబ్బెన మండలంలో వరద పరివాహక ప్రాంతాలను సందర్శించారు.భారీ వర్షాలు కురవడంతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.ప్రాణహిత బ్యాక్ వాటర్ తో చింతలమాలపల్లి సిర్పూర్ టి బెజ్జూర్ మండలాల్లోని పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి.అధిక వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని నూర్ నగర్ ప్రాంతంలో ప్రహరీ గోడ పడిపోగా సెప్టిక్ ట్యాంక్ వరదల కొట్టుకు వెళ్ళింది.పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఇంటి గోడ కూలిపోయింది.కాగజ్ నగర్,ఆసిఫాబాద్ పట్టణంలోని మురుగు కాలువలు నిండుకొని రోడ్డుపైకి మురికి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.