07-09-2025 01:10:26 AM
-నర్సింగ్ కాలేజీల్లో ఏళ్లుగా భర్తీకాని ప్రొఫెసర్ పోస్టులు
-అన్నింటా ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లే దిక్కు
-రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమాకం ఊసే లేదు
-నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌పై శ్రద్ధపెట్టని సర్కార్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్నట్టే అన్ని జిల్లాల్లోనూ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీల ద్వారా వైద్యులను తయారు చేస్తే.. నర్సింగ్ కాలేజీల ద్వారా వచ్చే నర్సింగ్ ఆఫీసర్లు కూడా ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు. వైద్యులు చికిత్స అందించే సమ యంలో మాత్రమే రోగుల వద్ద ఉంటే, నర్సింగ్ ఆఫీసర్లు 24 గంటల పాటు రోగుల బాగోగులు చూస్తారు. వైద్యులు లేకుంటే రోగికి చికిత్స ఉండదు.. కానీ నర్సులు లేకుం టే ఆ చికిత్స రోజువారీగా అమలు జరగదు.
నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర అంత విలువైంది. బెడ్‌సైడ్ కేర్, మానిటరింగ్, వైద్యుల ఆదేశాల అమలు, డాక్యుమెంటేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి కీలకమైన బాధ్యతలు నర్సు ల చేతుల మీదుగానే జరుగుతాయి. అంతటి కీలకమైన నర్సులను తీర్చిదిద్దే నర్సింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత, సిబ్బంది కొరత, వసతులు, నిధుల లేమి వేధిస్తోంది. కనీసం నర్సింగ్ కాలేజీల హాస్టళ్లకు సెక్యూరిటీ గార్డులు కూడా లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
క్యాడర్ స్ట్రెంత్ లేనేలేదు..
ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తే అక్కడ ఎవరెవరు ఏం పనిచేయాలో నిర్ణయిస్తూ అధికారులు, సిబ్బందిని నియమిం చేందుకు క్యాడర్ స్ట్రెంత్ ఎంతో నిర్ణయించాలి. కానీ ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో ఏర్పా టు చేసిన 16 నూతన నర్సింగ్ కాలేజీల్లో ఇప్పటివరకు కనీసం ఎంత మంది అధికారులు, ఫ్యాకల్టీ, సిబ్బంది పనిచేయాలో కూడా ప్రభుత్వానికి పట్టడం లేదు. నేటికీ క్యాడర్ స్ట్రెంత్‌ను కూడా నిర్ణయించలేదు. దీంతో అన్ని కొత్త కాలేజీలకు ఒక ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ను ఇచ్చేసి నర్సింగ్ కాలేజీని నడిపించమని అధికారులు చెప్పేశారు.
దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కనీసం ఒక స్వీపర్, అటెండర్, వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డు, వార్డెన్ లేకుండా పూర్తిగా మహిళలే ఉండే నర్సింగ్ కళాశాలలు ఎలా నడిపిస్తారో ప్రభుత్వానికే తెలియాలని విద్యార్థినులు వాపోతున్నారు. పేద విద్యార్థినులు బయట ప్రైవేటు హాస్టళ్లలో ఉండేందుకు ఆర్థిక సమస్యలు ఎదు ర్కొంటున్నారు. ఊడ్చేందుకు, తూడ్చేందుకు కూడా శానిటేషన్ సిబ్బంది లేకుండా కాలేజీని ఎలా నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదు. నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా సర్కారు ఇవ్వడం లేదు. విద్యార్థినులు ఉండే హాస్టళ్ల వద్ద కనీస భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో మొత్తం 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 2,320 సీట్లున్నాయి.
ఇందులో 4 చోట్ల మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపళ్లు (ప్రొఫెసర్లు) ఉన్నారు. మిగతా అన్ని చోట్లా అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో 32 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఇప్పుడు ఇన్‌చార్జి ప్రిన్సిపళ్లుగా ఉన్నారు. వారికి పదోన్నతులు కల్పిస్తే లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశం వస్తుంది. 80 మందికి పైగా లెక్చరర్లు పదోన్నతి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్ల సీనియారిటీ లిస్టును, లెక్చరర్ల సీనియారిటీ లిస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే నేటికీ పదోన్న తులపై ఉలుకూపలుకూ లేకపోవడంతో నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు చదువులు చెప్పే వాళ్లు లేకుండా పోయారు.
రాష్ట్రంలో 560 నర్సింగ్ లెక్చరర్ (డీఎల్) పోస్టుల ఖాళీ..
రాష్ట్రంలో ప్రభుత్వనర్సింగ్ కళాశాలల్లో 560 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఫ్యాకల్టీ లేకుండా తరగతులు ఎలా బోధిస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొంతమంది నర్సింగ్ ఆఫీసర్లను డిఫ్యుటేషన్‌పై తీసుకొచ్చినా అది ఏ మూలకూ సరిపోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ అధికారుల్లో సుమారు 200 మందికి ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు లెక్చరర్ల పదోన్నతి కోసం అన్ని అర్హతలున్నాయి. వీరికి సంబంధించిన సీనియారిటీ లిస్టు కూడా తయారు చేశారు. కానీ ఆ తర్వాత ఆ ఫైల్ ఎక్కడికక్కడే ఆగిపోయిందని సమాచారం. ఫ్యాకల్టీ లేక నర్సింగ్ చదువులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
అనుమతులు భారీ.. సౌకర్యాలు లేమి
గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ సర్కారు వేగంగా కళాశాలల ఏర్పాటు చేసిందని నర్సింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు. కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో బీఎస్సీ నర్సింగ్ చేసే పేద విద్యార్థులకు ఎంతో మేలు అయ్యింది. అయితే భవనాల ఏర్పాటుతో పాటు అత్యంత కీలకమైన ఫ్యాకల్టీ నియామకం విషయంలో అధికారుల డొల్లతనం బయటపడుతోంది. ఇప్పటి వరకు కనీసం ఫ్యాకల్టీ నియామకంపై దృష్టి సారించలేదు. పైసా బడ్జెట్ లేకపోవడంతో చాలా చోట్ల ప్రిన్సిపళ్లు చేతి నుంచి డబ్బులు వేసుకొని శానిటేషన్ పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్లకు ఏ విధంగా పదోన్నతులు, నియామకాలు చేపడుతున్నారో నర్సింగ్ కాలేజీలకు కూడా అలాగే చేయాలని నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది కోరుతున్నారు.