calender_icon.png 7 September, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా నాణ్యత పెంచినప్పుడే విద్యార్థులకు మేలు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

07-09-2025 01:10:20 AM

హన్వాడ: విద్యా నాణ్యత పెంచినప్పుడే విద్యార్థులకు మేలు జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి బోధనాభ్యసన సామాగ్రి మేళా, ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యా విషయాలపైన విద్యార్థులకు ఆసక్తి కలిగించడం తో పాటు వినూత్న బోధనా పద్ధతులను ప్రోత్సాహించాలని సూచించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి, పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తుందన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో శతశాతం ఫలితాలు సాధించాలని అలాగే మీమీ పాఠశాలల నుంచి కనీసం ఒక్కరైనా మన మహబూబ్ నగర్ లోని ఐఐఐటి కళాశాలలో సీటు సంపాదించాలని చెప్పారు. మన మహబూబ్ నగర్ లో ఉన్న ఐఐఐటి కళాశాలలో మన పిల్లలు చేరి వారు ప్రయోజకులు అయితే మన మహబూబ్ నగర్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది అని అన్నారు. మన నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో ఐఐఐటి కళాశాలలో సీటు సాధిస్తారనే  నమ్మకం విశ్వాసం నాకు ఉందని, మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకోవాలని చెప్పారు.

విద్యార్థులు తమ ఇంటి దగ్గర చదువుకోవడానికి వారి తల్లిదండ్రులు మంచి వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. విద్యార్థులపైన  ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని చెప్పారు. ఈ ఒక్క సంవత్సరం కష్టపడి ఇష్టంగా చదువుకొంటే  మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన విద్యార్థులకు చెప్పారు. సమయాన్ని వృధా చేస్తే, నష్టపోయేది కేవలం ఒక్క సంవత్సర సమయం కాదని అది జీవితకాలం మిమ్మల్ని వెనక్కు నెట్టుతూనే ఉంటుందని హెచ్చరించారు.మీకోసమే కేవలం 16 నెలల్లో నే మన మహబూబ్ నగర్ లో మూడు కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు తెచ్చామని అందులో ఐఐఐటి కళాశాల ఒకటి అని ఆయన చెప్పారు.

మీరు  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అందుకు  నేను నిరంతరము కష్టపడతానని అన్నారు .మీరు నాకు తిరిగి ఇవ్వాల్సింది కేవలం ఉత్తమ ఫలితాలు మాత్రమే చెప్పారు.  మీ అందరూ జీవితంలో  స్థిరపడితే  మీ తల్లిదండ్రులతో పాటు సంతోష పడడానికి నేను సిద్దంగా ఉంటానన్నారు. అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం మండల స్థాయి బోధనిభ్యాసన సామాగ్రి (టీఎంఎల్)మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు.