ట్రంపరితనంతో అమెరికాకు చేటు
అమెరికా స్వాతంత్య్రం సాధించిన నాటి నుంచి నేటి వరకు చాలామంది అధ్యక్షులుగా పనిచేసి అగ్రరాజ్యం అమెరికాకు, అధ్యక్ష పీఠానికి వన్నె తెచ్చారని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు ట్రంప్ మాత్రం బాధ్యతలు చేపట్టిన గతేడాది జనవరి నుంచి తన విధానాలతో, ద్వంద్వ ప్రమాణాలతో అమెరికా అధ్యక్ష పీఠానికి తలవంపులు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే నినాదంతో అమెరికాకు డాలర్ల వర్షం కురిపిస్తాననే ధీమాతో, తొలుత దాదాపు అన్ని దేశాలపై ‘ప్రతీకార సుంకాలు’ విధించి ముందుగా కెనడా, మెక్సికో, తదుపరి భారత్, చైనా ఆ తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు దూరం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని చైనా మాత్రమే వ్యతిరేకించింది. మిగిలిన దేశాల్లో కొన్ని అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకోగా, మరికొన్ని దేశాలు మౌనం వహించాయి. ముఖ్యంగా మన భారతదేశం సాచివేత ధోరణి అవలంభిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. రష్యా, చైనా వంటి దేశాలతో స్నేహ, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేసింది.
ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో ఎఫ్‌టీఏ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడి నిర్ణయా న్ని, ట్రేడ్ డీల్ విషయంలో జాప్యం చేయడం ద్వారా ట్రంప్‌ను పక్కనపెట్టింది. 2014 వరకు మన భారతదేశం అలీన విధానాన్ని అమలు చేయడం ద్వారా అమెరికా విషయంలో తటస్థంగా ఉంది. అయితే, మోదీ ప్రధాని అయిన తరువాత అమెరికాతో సాన్నిహిత్యం పెరిగింది. అలీన విధానాన్ని వదిలింది. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి.
బారత్‌తోనూ వైరమే
మన దేశ పాలకులు మొదటి నుంచి అమెరికా మనకు నమ్మదగిన మిత్రదేశం కాదని నమ్మేవారు. కానీ, దీనికి అతీతంగా మోదీ అమెరికాతో, ముఖ్యంగా ట్రంప్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగసాగింది. అయితే రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైన తరువాత భారత్‌ను కూడా అమెరికా శత్రుదేశంగా చూడటం మొదలుపెట్టింది.
మోదీ తన మిత్రుడని తరచూ చెప్పే ట్రంప్ కనీసం ప్రమాణస్వీకారానికి కూడా మన ప్రధానిని ఆహ్వానించలేదు. తద్వారా మన దేశాన్ని ప్రారంభం నుంచే దూరం చేసుకున్నారు. అయినా గత సంవత్సరం ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అయ్యారు. అయినప్పటికీ, మనకు ఏ రకమైన లబ్ధి కలగకపోవడంతో సంబంధాలు తగ్గించుకోవడం మొదలైంది. తదుపరి భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ప్రకటించడం, మన ప్రభుత్వం ఖండించడం లాంటివి జరిగాయి.
దీంతో అమెరికా, భారత్ మధ్య దూరం మరింత ఎక్కువైంది. ఈ విధంగా ట్రంప్ వ్యవహారశైలి కారణంగా అమెరికాకు భారత్ దూరం జరిగింది. ఇక వలస వ్యతిరేక విధానాలను అమలు చేయడం ద్వారా స్వదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ట్రంప్ పట్ల వ్యతిరేక భావన పెరగసాగింది. హెచ్1 వీసా మంజూరులోనూ ఆంక్షలు విధించారు. విద్యార్థుల వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు. దీంతో ముఖ్యంగా మన దేశం నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లసాగారు.
ఇక తదుపరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో జెలెన్‌స్కీకి ట్రంప్ హ్యాండిచ్చారు. సరికదా ఉక్రెయిన్‌లో ఉన్న విలువైన ఖనిజాలపై కన్నేసి డీల్ చేసుకోవాలని హుకూం జారీచేశారు. దీంతో అమెరికాను నమ్మి సుదీర్ఘంగా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ట్రంప్ విధానాలతో విసిగిపోయి, కొంత దూరం పాటించసాగింది. ప్రస్తుతం ఒంటరిగానే పోరాటం చేస్తున్నది.
ఇక గత దశాబ్దాలుగా చైనాకు వ్యతిరేకంగా ‘తైవాన్’తో సత్సంబంధాలు కలిగి ఉన్న అమెరికా, నేడు చైనాతో జతకలసి తైవాన్‌కు చెయ్యిచ్చింది. ‘గ్రీన్ ల్యాండ్’ తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నాటో దేశాలు దూరం జరిగాయి. ఆర్థిక సహకారం నిలిపివేసి ఐక్యరాజ్యసమితితోనూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ సంబంధాలను చెడగొట్టుకున్నది. దీంతో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపో యాయి. తద్వారా ఆయా దేశాలు ట్రంప్ విధానాలతో విసిగిపోయాయి.
ఓ దేశాధ్యక్షుడిని బంధించి..
ఈ సంవత్సరం ప్రారంభంలో సైనిక చర్య ద్వారా వెనుజువెలా అధ్యక్షుడిని బంధించి అమెరికాకు తీసుకుని వెళ్లారు. వెనుజువెలాలోని చమురును కొల్లగొట్లాలనే లక్ష్యం దీని వెనుక ఉన్నదనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు క్యూబాను లొంగదీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాజాగా ఇజ్రాయెల్‌తో జతకలసి ఇరాన్‌పై యుద్ధానికి దిగారు. దీంతో అంతర్జాయతీ సప్లయ్ చైన్ దెబ్బతిన్నది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొన్నది. దీనివల్ల మొత్తం ప్రపంచానికి ట్రంప్ విధానాల పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటి వరకూ దాదాపు గల్ఫ్ దేశాలు అన్ని అమెరికా రక్షణ నీడలో దర్జాగా సేద తీరాయి. అయితే ఇరాన్‌తో యుద్ధానికి దిగడం ద్వారా అమెరికా స్థావరాలు ఉన్న దాదా పు అన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇరాన్ దాడులతో ఆర్థికంగా, రాజకీయంగా కుదేలయ్యాయి. ఇన్నాళ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికాను, అమెరికా అధ్యక్షుడిని నమ్మి, ఆ దేశంపైనే అన్ని రకాలుగా ఆధారపడి మనుగడ సాగించాయి.
అయితే తాజాగా ట్రంప్ విధానాలతో గుణపాఠాలు నేర్చుకుని, స్వయం ప్రతిపత్తి కలిగి, ప్రతీ దేశం తమ తమ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలని గ్రహించాయి. ముఖ్యంగా ప్రతీ దేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకోవాలని తెలుసుకున్నాయి. ఇక మరో విషయం ముఖ్యంగా ‘నోబెల్ పురస్కారం’ తనకు ప్రకటించలేదని నోబెల్ కమిటీపైనే ఆక్రోశం వెలిబుచ్చారు.
ఇరాన్ చర్చలకు ప్రతిబంధకం
ఇక తాజాగా ఇటలీ ప్రధాని మెలోని తనతో ఫొటో దిగడానికి అనుమతి కోరిందంటూ సోషల్ మీడియాలో, పత్రిక సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ఇటలీ ప్రధాని ఈ మాటలను, వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఇరాన్‌తో యుద్ధానికి దిగిన సందర్భంలోనూ ఇటలీతోపాటు యూర ప్, నాటో దేశాలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగానే ఉండటం గమనార్హం. తాజాగా స్విట్జర్లాండ్‌లో ‘అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు మధ్యలో నిలిచిపోవడానికి కూడా ట్రంప్ దుందుడుకు స్వభావమే కారణమని తెలుస్తున్నది.
తాజా పరిణామాలు పరిశీలిస్తే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో ఏ దేశం కూడా అమెరికాను నమ్మే స్థితిలో లేదు. ప్రతీ దేశం తమ తమ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలనే వాస్తవాన్ని గ్రహించాయి. ముఖ్యంగా అమెరికా వంటి ఒక దేశంపైనే ఆధారపడి ఉండకూడదని, ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలతోనూ వాణిజ్య, రాజకీయ, సామాజిక సంబంధాలు, దౌత్య సంబంధాలు కలిగి ఉండాలనే స్పృహ అన్ని దేశాలకు కలిగింది.
ఈ క్రమంలో అన్ని దేశాలు రక్షణ వ్యయం తగ్గించుకోవాలి. ఉపాధి, సంక్షేమ రంగాలపై దృష్టిసారించాలి. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అంద రూ తెలుసుకోవాలి. ఆయుధాల కంటే ఆలోచనలతో ముందుకు సాగడం మంచిదని గ్రహించాలి. ఈ వాస్తవాన్ని ఇతర దేశాలు కూడా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఒకరి కోసం అందరం, అందరి కోసం మనందరం అనే నినాదంతో ఈ ప్రపంచం ముందుకుసాగాలి.
వ్యాసకర్త సెల్: 6305682733
ఐ.ప్రసాదరావు






