16-07-2025 12:00:00 AM
ప్రతివ్యక్తికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పు డు పరీక్షాకాలం ఎదురవుతుంది. వారికది జీవన్మరణ సమస్య కావచ్చు. దానివల్ల వారిపై ఆధారపడిన జీవితాలూ బజారునపడే సందర్భమూ కలుగవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఎదురవచ్చు. భాగస్వాములు వారిని విడి వెళ్లిపోవచ్చు.
రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులకు అనుచరులు దూరం కావచ్చు. పదవులు పోవచ్చు. వైద్యుని నిర్ణయం రోగికి ప్రాణం పోయవచ్చు లేదా ప్రాణం తీయనూవచ్చు. అలాంటి విపత్కర పరిస్థితిలో, అనిశ్చితస్థితిలో.. ‘నేనున్నాను’ అని ధైర్యం చెపుతూ, భావోద్వేగాలను పంచుకుంటూ, మార్గదర్శన చేసే వ్యక్తుల సహ కారం అవసరం.. అలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆప్తమిత్రుల సహాయాన్ని ఆశిస్తాం. అలాంటి ఆపత్కాలంలో ఎవరిని ఆశ్రయించాలో చాణక్యుడు మార్గదర్శన చేస్తున్నాడు.
ప్రియో యస్య భవేద్యో వా ప్రియో యస్య కతస్తయోః ప్రైయో యస్య స తం గచ్ఛేది త్యాశ్రయగతిః పరా! (కౌటిలీయం 72) వ్యక్తి తన జీవన గమనంలో తీసుకున్న నిర్ణయం.. తనకుగానీ, తనవారికి గానీ హానిని కలిగిస్తూ, ప్రమాదాల అంచుల్లోకి నెట్టివేసే సమయంలో, ప్రతికూలతలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసే వేళలో అవసరానికి సహకారం అందిస్తూ రక్షణ కవ చంలా ఎవరు నిలుస్తారని ఎదురు చూస్తు న్న వేళ.. తాను ఎవరికి ప్రియుడో, ఎవరు తనకు ఇష్టుడో ఆ ఇద్దరిలో ఎవరిని ఆశ్రయించాలనే సంశయం కలిగినప్పుడు, తాను ఎవరికి ఇష్టుడో వానిని ఆశ్రయించు ట ఉత్తమమంటాడు ఆచార్య చాణక్య. నిజానికి ‘ఆశ్రయం’ అనేదానిని.. వ్యక్తి ఆపత్కాలంలో సమకూర్చుకోవాల్సిసిన వన రులు, సహకరించే అనుచర వర్గానికి ప్రతీకగా చెప్పుకోవాలి. నాయకుడు పాలకుడైతే తన ప్రజల సంరక్షణ, వ్యాపారవేత్త అయి తే ఉద్యోగుల సంక్షేమ బాధ్యత, కొనుగోలుదారుల భద్రత తనపైన ఉంటుంది. వ్యవ సాయం, వ్యాపారం, వర్తకంలాంటి ఉత్పత్తి రంగాలను లేదా సేవారంగాలను అభివృ ద్ధి చేయడం, పోటీదారుల నుంచి రక్షణ అందివ్వడం.. నాయకుల కర్తవ్యం, అది వారి బాధ్యత కూడా.
ఎదుటివారి హృదయాలను గెలవాలి
ఎప్పుడో ఎవరికో ఏదో సహాయం చేస్తాం. అది చిన్న సాయమే కావచ్చు కానీ, అవతలి వ్యక్తికది గొప్ప ఫలితాన్ని ఇవ్వవ చ్చు. దానితో అతని హృదయంలో మనపట్ల ప్రత్యేకమైన, ఉన్నతమైన గౌరవభా వం ఏర్పడుతుంది. అతడు మనల్ని అమితంగా ఇష్టపడతాడు. అతను స్థాయిలో చిన్నవాడే కావచ్చు కానీ, ఆపత్కాలంలో తన శక్తికి మించి అన్ని విధాలుగా సాయం చేసేందుకు ముందుకు వస్తాడు. అదే మనం ఒకరిని ఇష్టపడితే.. మనం అతనికి సాయపడగలమే కాని మనలని అతను ఆత్మీయునిగా గుర్తించి, తదనుగుణంగా ప్రవర్తిస్తాడని భావించలేం.
ఎదుటివారి పట్ల ఎలా ప్రవర్తించాలో మన నిర్ణయం.. కానీ ఎదుటివారు మనపట్ల ఎలా ప్రవర్తించాలో మనం నిర్ణయించలేం. అయితే.. ఒక రి హృదయాన్ని గెలవడం,అతనికి ఇష్టుడు కావడం మాత్రం సులువైన అంశం కాదు. అలా ఒకరికి ఇష్టుడవడం మాత్రం వ్యక్తి జీవితంలో ఉత్తమ సాధనగానే చెప్పుకోవ చ్చు. ఎదుటివారి హృదయాన్ని గెలవాలం టే.. నిరంతరం చిన్నదో పెద్దదో ఇతరులకు సాయం చేస్తూపోవడమే. ఒక దివ్యాంగురాలు బస్సులో తన సీటును మరొకరికి ఇచ్చి నిలుచోవడం చదివాం. అదికూడా సాయమే. అవతలి వ్యక్తి గర్భిణికావచ్చు, పెద్ద వయస్సు వారు కావచ్చు.. వారి హృదయాల్లో కృతజ్ఞతా భావన నిండిపోతుంది.
స్నేహం.. అవమానానికి దారి తీయొచ్చు..
స్నేహం సమాన స్కందుల మధ్య ఉన్నతంగా ఉంటుంది. ఒకరు బలహీనులైన వేళ ఆ స్నేహం ముఖం చాటేస్తుంది. మహాభారతంలో ద్రోణుడనే బ్రాహ్మణుడు, ద్రుపదుడనే రాజకుమారుడు ప్రాణస్నేహితులుగా ప్రవర్తిస్తూ, అగ్నివేశుడనే మహర్షి వద్ద అస్త్ర విద్యలు నేర్చారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళుతూ ద్రోణుడితో.. ‘నీకు ఏ అవస రం వచ్చినా నేను సహాయపడతాను.. నన్ను కలవు’ అని చెబుతాడు. ఇద్దరూ విడిపోతారు. కొద్దికాలం తర్వాత అమితమైన దారిద్య్ర బాధతో ద్రోణుడు తన స్నేహితుడైన ద్రుపదుని సహాయం కోసం అతని పట్టణానికి వెళతాడు. ద్రుపదుడు అప్పుడు ద్రోణుడితో ‘మహారాజుకు దరిద్రునితో మైత్రి కుదరదు’ అంటూ దారుణంగా అవమానించి పంపిస్తాడు.
అహంకారం కళ్లుగ ప్పితే ఎంత గొప్ప స్నేహమైనా చెడిపోతుం ది. శల్యుని దుర్యోధనుడు మిత్రునిగా చేసుకొని లబ్ధిపొందేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడే కర్ణుని మరణానికి కారణమై యుద్ధంలో కౌరవులకు నష్టం కలిగించా డు. అలాగని మిత్రులను నమ్మకూడదని కాదు. కృష్ణుడు కుచేలునికి మిత్రుడు. యా చించడం కూడా చాతకాని కుచేలుని మనసెరిగిన కృష్ణుడు అడగకుండానే అతని అవసరాలను తీర్చాడు. మిత్రులకు సహా యం చేస్తే వారది తమ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా భావిస్తారే కానీ, ఆదరం తో చేసిన సహాయంగా గుర్తించరు. తద్వా రా వారిద్దరి మధ్య కొన్ని పరిమితులు ఏర్పడతాయి. మైత్రి స్థానంలో యజమాని ఉద్యోగుల సంబంధం తొంగిచూస్తుంది.
శత్రువును ఉపయోగించుకోవడం తెలియాలి..
‘మిత్రులను అతిగా నమ్మవద్దు. శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి’ అంటాడు రాబర్ట్ గ్రీన్. మన లోటుపాట్లు శత్రువులకు తెలిసినంతగా, ఆప్తమిత్రులకూ తెలియకపోవ చ్చు. ఈమధ్యనే ఆవులు దాడిచేసి ఒకరిని గాయపరచిన వార్తను విన్నాం.ఆవు సాధు జంతువనీ, దాని వద్దకు వెళితే ఏమనదనే భావనతో దాని వద్దకు వెళతాం. కానీ, సిం హం గుహలోకి వెళితే ఏమవుతుందో మనకు తెలుసు కనుక, దాని గుహలోకి వెళ్లం కదా. అలాగే స్నేహితుల వద్ద అజాగ్రత్తగానే ప్రవర్తిస్తాం.. కానీ, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉంటాం. దగ్గరి బంధువు లు, ఆప్తమిత్రులను ఆదరించి ఉద్యోగులు గా నియమించుకుంటే.. వారు చేసిన తప్పిదాలకూ మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అదే శత్రువులను ఉద్యోగులు గా నియమించుకుంటే.. వారు తమ సామర్థ్యాన్ని, నైపుణ్యాలను నిరూపించుకునేం దుకు పాటుపడతారు. యజమానిని ఆకట్టుకునేందుకు, వారిని వారు నిరూపించు కునేందుకు, పరిమితులను అధిగమించి ప్రయత్నిస్తారు. ఇద్దరు బలమైన శత్రువులు ఒక్కటై ఒకే లక్ష్యంవైపు నడిస్తే లక్ష్యం ఎంత దుర్గమమైనదైనా గడించడం సాధ్యపడుతుంది. కత్తి పిడి వైపు మైత్రికి చిహ్నం గా భావిస్తే.. అంచులు శత్రువుగా భావించవచ్చు. అంచువైపు పట్టుకుంటే గాయపరు స్తుంది. పిడివైపు పట్టుకుంటే రక్షణ పొం దేందుకు ఉపకరిస్తుంది. ఎటువైపు పట్టుకోవాలో తెలుసుకోవడమే అసలైన విజ్ఞత. శత్రువును ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే.. విజయమార్గం అవగతమైనట్లే.. వివేకవంతులు శత్రువు నుంచి కూడా లాభం పొందే నేర్పును సంతరించుకుంటారనేది సూక్తి.