28-01-2026 03:45:29 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు మెట్రో పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వెంకట్, రాకేష్, యశ్వంత్లకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వారంతా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.