calender_icon.png 28 January, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల టీ జంక్షన్ వద్ద బస్టాండ్ ఏర్పాటుకు స్థల పరిశీలన.

28-01-2026 06:05:25 PM

కొల్చారం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలతో ఏడుపాయల టీ జంక్షన్ వద్ద బస్టాండ్ ఏర్పాటుకు అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు.  రాష్ట్రంలోని ప్రఖ్యాత ఏడుపాయల వన దుర్గ భవాని మాత దేవాలయాన్ని సందర్శించే భక్తులు కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా సమీపంలోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద బస్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ గత ఏడాది వేసవిలో తాత్కాలిక బస్టాండ్ ను టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేయించారు. 

జాతర సమయానికి శాశ్వతంగా జాతీయ రహదారికి ఇరువైపులా బస్టాండ్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం అధికారులు స్థల పరిశీలన చేశారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు బస్టాండ్ ల ఏర్పాటుకు ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. నర్సాపూర్ నుండి మెదక్ వెళ్లే మార్గంలో, మెదక్ నుండి నర్సాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఇరువైపులా బస్టాండ్ ఏర్పాటుకు అధికారులు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, సర్వేయర్ అనురాధ, ఏడుపాయల ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.