23 June, 2026 | 1:33 AM

ఉక్రెయిన్ ఉగ్రరూపం

23-06-2026 12:00 AM

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిందని ఊపిరి పీల్చుకునేలోపే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి కొనసాగింపుగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ పోరు కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న విషయం విదితమే. తాజాగా రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో విరుచుకుపడటంతో ఈ యుద్ధం మరోసారి కొత్త దశలోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

ఈ డ్రోన్లలో చాలావరకు రష్యా కూల్చివేసినప్పటికీ, రాజధాని ప్రాంతంపై భారీ స్థాయిలో దాడులు జరగడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగానే కనిపిస్తున్నది. అయితే, ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు వేదికగా ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా, యూరప్ దేశాలు ప్రకటించడం తాజా దాడులకు ప్రేరణగా మారిందని వాదనలు వినిపిస్తున్నాయి.

వైమానిక రక్షణ వ్యవస్థలు అందిస్తామని, ఆర్థిక సహాయాన్ని మరింత పెంచుతామని చెప్పడం, అదే సమయంలో రష్యాపై ఒత్తిడిని పెంచుతామని హామీ ఇవ్వడంతో ఉక్రెయిన్ నాయకత్వానికి భరోసా లభించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే మాస్కోపై మరింత దూకుకుగా దాడులు ప్రారంభించినట్టు చెప్తున్నారు. గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య చర్చలు ముందుకు సాగకపోవడం, రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి అప్పగించకపోవడంతో ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తున్నది.

రష్యాలోని చమురు శుద్ధికేంద్రాలు, సరఫరా మార్గాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆ వ్యూహంలో భాగమే. ముఖ్యంగా రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ప్రాంతానికి ఆయుధాలు, ఇతర నిత్యావసరాలు అందకుండా అడ్డుకోవడమే ఉక్రెయిన్ లక్ష్యంగా కనిపిస్తున్నది. అయితే, రష్యా వెంటనే ప్రతిదాడులు చేయకుండా పరిస్థితిని అంచనా వేస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ ఆంక్షలతోపాటు ఆర్థిక ఒత్తిడి, సైనిక వ్యయాలు రష్యా నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ యుద్ధం ఎటువైపు మలుపు తిరుగుతుందనే కీలక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కాగా, జీ7 దేశాలు కూడా ఒకవైపు ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు చర్చలే సమస్యకు అంతిమ పరిష్కారమని నొక్కిచెప్తున్నాయి.

ఇరుపక్షాలు నిర్ణయాత్మక విజయం సాధించకపోవడం, భారీగా ఆర్థిక నష్టం మూలంగా సుమారు నాలుగు నెలలపాటు సాగిన పశ్చిమాసియా పోరు చివరికి చర్చల రూపంలో శాంతించిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. ఈ తరుణంలో ప్రస్తుత దాడులను యుద్ధం తీవ్రరూపం దాల్చడానికి సూచికగా కాకుండా, ప్రపంచ దేశాలకు లభించిన మరో వ్యూహాత్మక అవకాశంగా భావించి ఇరుపక్షాలను చర్చల గోదాలోకి దింపి, శాంతికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది.