అంచనాల్ని మించిన అల్ట్రాటెక్ సిమెంట్
నికరలాభం 35% అప్
షేరుకు రూ.70 డివిడెండు సిఫార్సు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: అదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని మించాయి. మార్చితో ముగిసిన క్యూ4లో కంపెనీ నికరలాభం 35 శాతం వృద్ధిచెంది రూ. 2,259 కోట్లకు చేరింది. అల్ట్రాటెక్ రూ. 1,976 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని సగటున 12 బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. గత ఏడాది క్యూ4లో కంపెనీ రూ.1,670 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. సమీ క్షా త్రైమాసికంలో అల్ట్రాటెక్ ఆదా యం 9.4 శాతం వృద్ధితో రూ. 20,419 కోట్లకు చేరింది. 2023 డిసెంబర్ త్రైమాసికంకంటే ఆదాయం 21 శాతం, లాభం 27.3 శాతం చొప్పు న పెరిగింది. కన్సాలిడేటెడ్ ఇబిటా రూ.3,444 కోట్ల నుంచి రూ.4,250 కోట్లకు చేరింది. బిల్డింగ్ మెటీరియల్స్‌కు డిమాండ్ పెరగడం, నిర్వహణా వ్యయాలు తగ్గడంతో ప్రోత్సాహకరమైన ఫలితాల్ని కంపెనీ సాధించ గలిగింది. సోమవారం సమావేశమైన అల్ట్రాటెక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.70 చొప్పున డివిడెండును సిఫార్సు చేసింది.






