15-11-2025 01:05:57 AM
-అన్నీ తామై ప్రచారం చేసిన కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు
-అంతర్గత కలహాలతో జూబ్లీహిల్స్‌లో ఓటమి
-శ్రమించినా దక్కని ఫలితం.. బీజేపీ శ్రేణులు డీలా
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్రిముఖ పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే నని మొదటి నుంచి చెప్పుకొస్తున్న కమలం ఈ ఎన్నికల్లో వాడిపోయింది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ సాగింది. ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 (50.83 శాతం) ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 (38.13 శాతం) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 (8.76 శాతం) ఓట్లు పోల య్యాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు ముందు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా శ్రమించారు. కానీ, ఫలితం దక్కపోవడంతో ఆ పార్టీ శ్రేణులు డీలా పడ్డారు.
అంతర్గత కలహాలతో..
బీజేపీ అభ్యర్థి ఎంపికలోనూ ఆలస్యమే జరిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో నిమగ్నమైతే, బీజేపీ మాత్రం కాస్త ఆలస్యంగా ప్రకటించింది. రాష్ర్ట నాయకత్వం ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి కేంద్ర నాయకత్వానికి పంపినప్పటికీ వారి పట్ల అధిష్ఠానం ఆసక్తి చూపలేదు. బీహార్ ఎన్నికల షెడ్యూల్‌కు ఇచ్చిన ప్రాధాన్యం జూబ్లీహిల్స్‌కు ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికితోడు పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య అంతర్గత కలహాలు సైతం ఈ ఓటమికి కారణమనే చర్చ జరుగుతోంది.
ఎన్నికల ప్రచారంలోనూ ఆ పార్టీ కీలక నేతలు పెద్దగా పాల్గొనలేదన్న ప్రచారం ఉంది. స్టార్ క్యాంపెయినర్లు కూడా రాలేదు. కేవలం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు మినహా మిగిలిన వారు పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గన్న దాఖలాలు లేవు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కేంద్రమంత్రి బండి సంజయ్ నామినేషన్ రోజు పాల్గొని, మళ్లీ చివరి రెండు రోజులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అర్వింద్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వీరంతా పూర్తి స్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తరహాలో బూత్‌స్థాయిలో మకాం వేయలేకపోయారు.
ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మణ్ అక్కడక్కడ ప్రచారం చేశారు. దీనికితోడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో పార్టీ నేతలెవరూ పెద్దగా జోక్యం చేసుకోలేదు. ప్రచారానికి కిషన్‌రెడ్డి కూడా పిలవలేదని, నేతల మధ్య అంతర్గత కలహాలూ ఉన్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. జనసేన, టీడీపీ మద్దతు ఉన్నా పెద్దగా ఓట్లు రాబట్టలేకపోయారు.
రాంచందర్‌రావుకు తొలి ఓటమి..
ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచారం ఆకట్టుకోలేకపోయిందని పలువురు భావిస్తు న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ స్థాయిలో ప్రచారం చేసి ఓటర్లను తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. కానీ బీజేపీ నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారనే చర్చ జరుగుతున్నది. కిషన్‌రెడ్డి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైఫ ల్యాలను విమర్శించడంలో వెనుకబడ్డారనే మాటలు వినిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్, ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తే.. బండి సంజయ్ కేవలం హిందూ, ముస్లిం సామాజిక వర్గం ఎజెండాను ఎత్తుకున్నారు. హిందువులంతా ఏకం కావాలని కోరారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష భాద్యతలు చేపట్టిన తర్వాత రాంచందర్‌రావుకు ఇది తొలి ఓటమిగా చెప్పుకుంటున్నారు.
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీ నేతలు ఫలితాలపై లోతుగా సమీక్ష చేసుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇద్దామనుకున్న పార్టీ నేతల ఆశలను కాంగ్రెస్ గల్లంతు చేసింది.