4 May, 2026 | 1:44 PM

ఊహకందని విపత్తు

03-09-2024 04:00 AM
  1. అంతలోనే ఇంత భారీ వర్షాలా?
  2. విపత్తులపై మరింత సంసిద్ధులం కావాలె..
  3. పోలీసులకు కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్ శిక్షణ
  4. నాలుగు జిల్లాలకు తక్షణం రూ.5 కోట్ల చొప్పున నిధులు

హైదరాబాద్, సెప్టెంబర్ ౨ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంత తక్కువ సమ యంలో ఇంతటి భారీ వర్షాలు కురువటంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వర్షాలను తాము కూడా అంచనా వేయలేకపోయామని వాతావరణ విభాగం అధికారులు సీఎంకు తెలిపారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో సమీక్షలో పరిస్థితిని వారు వివరించారు. అతి తక్కువ సమయం లో ఇంతటి భారీ వర్షాలు కురవడానికి కారణాలేమిటి? సోమ, మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందా? అని సీఎం ప్రశ్నించారు.

దీంతో ఊహించినదానికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ‘గతంలో ఐదేండ్లకో.. పదేండ్లకో ఒకారి ఇలా భారీ వర్షాలు కురిసేవి. ఇటీవల తరచూ కుంభవృష్టి కురుస్తున్నది. దీనిపై మరింత అధ్యయనం జరుగుతున్నది’ అని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని అధికారులు చెప్పటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సహాయ శిబిరాలకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి 24 గంట లూ పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రతి మూడు గంటలకు ఒక బులెటిన్ విడుదల చేయాలని సూచించారు. కాంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. 

రోజువారీ కూలీలకు నిత్యావసరాలు 

హైదరాబాద్ నగరంలో చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోవ డానికి వీళ్లేదని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్తు, ట్రాఫిక్, తాగునీరు, శానిటే షన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ను నిరంతరంగా పర్యవేక్షించాలని, విద్యుత్ సమ్యలు ఉంటే వెంట నే పరిష్కరించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని కోరారు. నిత్యం కూలీ పనులకు వెళ్లేవారికి వర్షాలతో పనులు లేక ఇంటి దగ్గరే ఉండిపోతారని, వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 

యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహా శిక్షణ

రాష్ట్రంలోని 8 బెటాలియన్లలో మూడో వంతు యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి తక్షణ సాయం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. ‘మనం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల దగ్గర ఉన్న బలగాలను పంపిస్తారు. ఇందుకు సమయం పడుతుంది’ అని అధికారులు సమాధానమిచ్చారు. అందుకు స్పందించిన సీఎం ‘భవిష్యత్తులో ఇలా ంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేయాలి.

మన దగ్గర ఉన్న బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు. వెంటనే సామగ్రిని కొనుగోలు చేయం డి’ అని అధికారులకు సూచించారు. ఒడిశా, గుజరాత్‌లో ఇలాగే శిక్షణ ఇచ్చి సొంతంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నారని అధికారులు తెలుపగా.. అవ సరమైతే అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని, అక్కడ అనుభవం ఉన్నవారితో మన పోలీసులకు శిక్షణ ఇప్పించాలని సీఎం ఆదేశించారు.

అందుకోసం ఒక మాన్యువల్‌ను రూపొందించాలని, ప్రతి సీజన్‌కు ముందు శిక్షణ తీసుకున్న సిబ్బందితో రిహార్సల్ చేయించాలని సూచించారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్ సిబ్బంది వెంటనే కరెంటు సరఫరాను పునరుద్ధరించారని  సీఎం ప్రశంసించారు. అప్రమత్తంగా ఉండి విద్యుత్ సమస్య తలెత్తుకుండా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని సీఎం సూచించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్లా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.