30 June, 2026 | 1:25 AM

వరదలో బురద రాజకీయమా?

03-09-2024 01:35 AM

బాధితులను పరామర్శించే సమయం లేదా?

ఒకాయన అమెరికాలో.. మరొకాయన ఫామ్‌హౌస్‌లో

బండి, కిషన్‌రెడ్డి కేంద్ర సాయం తేవాలి 

సూర్యాపేట సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరద సమయంలో బురద రాజకీ యాలు చేయడం సరికాదని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భారీ వర్షా ల కారణంగా ప్రాణ, ఆస్తి, పంట నష్టపోయిన వారికి రాజకీయాలను పక్కకు పెట్టి కలిసికట్టుగా సాయమందిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు బాధితులను పరామర్శించేందుకు కూడా రావటం లేదని మండిపడ్డారు. బెయిల్ కోసం ౨౦ మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లటానికి సమయం ఉంటుంది కానీ.. సర్వస్వం కోల్పోయిన ప్రజలను కలిసేందుకు సమయం ఉండదా? అని ప్రశ్నించారు.

సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం నామవరం స్టేజీ వద్ద ఉన్న పీఎన్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం వరద నష్టంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజులోనే 30 సెంటీమీటర్ల వర్షం కురవటం వల్లనే నష్టం అధికంగా ఉందని తెలిపారు. సాగర్ ఎడమ కాల్వ కట్ట తెగడంతో జరిగిన పంట నష్టంపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబా టులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిస్థితిని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేత రాహుల్‌కి వివరించి సాయం కోరినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ సాయం అందించే ందుకు సూర్యాపేట కలెక్టర్‌కు రూ.5 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పరిస్థితిని బట్టి పాఠశాలలకు సెలవుల నిర్ణయాధికారం కలెక్టర్లకు అప్పగించామని తెలిపారు. వరద బాధితులకు సాయమందించేందుకు ముందుకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. 

కేంద్ర మంత్రులు ముందుకు రావాలి

కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ముందుకొచ్చి కేంద్రం నుంచి వరద సాయం తక్షణం అందేలా చూడాలని సీఎం కోరారు. రాజకీయాలు చేయడానికి సమయం కాదని,  నష్టపోయిన ప్రజలకు అండగా నిలవాల్సిన సమయమిది అని పేర్కొన్నారు. సీఎం వెంట డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు. 

శాఖలవారీగా నష్టం వివరాలు

డిపార్ట్‌మెంట్ నష్టం అంచనా

(రూ. కోట్లలో)

రోడ్లు 2,362

విద్యుత్ 175 

పంటలు

(4.15 లక్షల ఎకరాలు) 415 

ఇరిగేషన్ 629

పంచాయతీరాజ్ 170 

మెడికల్, హెల్త్ 12 

పశుసంవర్దక శాఖ 25 

మున్సిపల్ శాఖ 1,150 

ఇతర ప్రభుత్వ, 

ప్రైవేట్ ఆస్తులు 500