మృత్యుపాశాలుగా కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు!
పాఠశాల ప్రహారీ పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌తో భయాందోళన
ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
కంగ్టి, ఆగస్టు 21: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల్లో రక్షణ కంచెలు (ఫెన్సింగ్) లేని ట్రాన్స్ఫార్మర్లు ప్రజలను, మూగ జీవాలను బలితీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా విద్యుత్ అధికారులకు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్టి మండలం చాప్టా(కే) ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీకి సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇళ్ల ముందు, రహదారుల పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు లేకపోవడంతో పశువులు, చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల మండలంలో కరెంట్ షాక్ తగిలి ఆవు, బర్రె, మేకలు మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడంతో విద్యుత్ భద్రతపై మరింత ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు విద్యుత్ షాక్తో పశువులు మృతి చెందిన నేపథ్యం లో ప్రజావాణి లో పిర్యాదు చేసినా అధికారుల స్పష్టత లేదు.
మూగజీవాల మృత్యుఘోష..
రక్షణ కంచెలు లేకపోవడం వల్ల పంట పొలాల్లో మేతకు వెళ్లే ఆవులు, గేదెలు, గొర్రెలు ప్రమాదవశాత్తు ఈ ట్రాన్స్ఫార్మర్లను తాకి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణిస్తున్నాయి. కష్టపడి పెంచుకున్న పాడి పశువులు కళ్ల ముందే ప్రాణాలు విడుస్తుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాత్రి వేళల్లో అటుగా వెళ్లే ప్రజలు, రైతులు ఎప్పుడు ఏ వైరు తగిలి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని గుండెల్లో గుబులుతో బతుకు తున్నారు.
ఇంటిముందే ట్రాన్స్‌ఫార్మర్...
ఇంటి ముందు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన వైర్లు కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయమేస్తోంది. ఇంటి వద్ద చిన్నారులు, కుటుంబ సభ్యుల రాకపోకలు ఉండటంతో మరింత ఆందోళనగా ఉంటుంది. ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో పాటు వైర్లను సక్రమంగా అమర్చాలి.
ఇటుగొండ రైతు, చాప్టా(కే)






