03-02-2026 01:20:09 PM
హైదరాబాద్: ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా.. ఇది వికసిత్ భారత్ కోసం పెట్టిన బడ్జెట్ అన్నారు. పీఎం ఆవాస్ కింద తెలంగాణ రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించారని కిషన్ రెడ్డి వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొమురవెల్లి, జోగులాంబ గద్వాల్ రైల్వే స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 5 వందేభారత్ , 2 అమృత్ భారత్ లైళ్లను కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు తెలంగాణకు రానున్నాయని వివరించారు. రూ. 5.50 లక్షల కోట్లతో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లకు ప్లాన్ చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్-యాదగిరిగుట్ట(Hyderabad-Yadagirigutta) మధ్య ఎంఎంటీఎస్ మూడో పేజ్ వస్తుందన్నారు. ఎంఎంటీఎస్ మూడో లైన్ కు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే భూమిపూజ చేస్తారని తెలిపారు.
మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులు తెచ్చే బాధ్యత తనదని కిషర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ దగా వల్ల సింగరేణి భ్రష్ట్రు పట్టిందని ఆరోపించారు. సింగరేణి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) మార్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే వెళ్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.