11 July, 2026 | 3:50 AM

కులగణనకు యూనిక్ కోడ్లు కేటాయించాలి

11-07-2026 02:33 AM

పలువురు బీసీ నేతల డిమాండ్

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ’జనగణనలో కులగణన-మళ్లీ మోసపోతున్న బీసీలు’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ప్రతి కులానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు(ఐఏఎస్, రిటైర్డ్) మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న జనగణన ప్రీ-టెస్టింగ్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కోడ్లు ఉండగా, ఇతర కులాలను ఓపెన్-ఎండెడ్ విధానంలో నమోదు చేయడం వల్ల డూప్లికేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

2011 ఎస్‌ఈసీసీ, తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే అనుభవాలను ప్రస్తావిస్తూ, 2024 తెలంగాణ కుల సర్వే, బీహార్ కులగణన తరహాలో కోడ్ వ్యవస్థను అమలు చేయాలని కోరారు. అలాగే ప్రశ్నావళిని ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించి, ప్రజా సంఘాలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను విడుదల చేశారు.

ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్ పూర్ణ చందర్ రావు(ఐపీఎస్, రిటైర్డ్), బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ కులగణనను పారదర్శకంగా నిర్వహించి ప్రతి కులానికి యూనిక్ కోడ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి ఎస్. దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎర్రమాద వెంకన్న, చెన్న శ్రీకాంత్, సింగం నాగేశ్వర్ గౌడ్, కొండల్ గౌడ్, లింగేశ్ యాదవ్, జెల్ల నరేందర్, భిక్షపతి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.