11 July, 2026 | 3:51 AM

హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి చేరతానంటే.. పీఏసీలో చర్చిస్తాం!

11-07-2026 02:33 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెపితే ..  తమ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చ ర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి.. హరీశ్‌రావు మిట్ట మధ్యాహ్నం చుక్క లు చూస్తున్నారన్నారు. పదేళ్లుగా మంత్రిగా పని చేసిన హరీష్‌రావు ఏమి చేశారని, మళ్లీ మూడు నెలలు టైమ్ ఎందుకు ఇవ్వాలని మహేష్‌కుమార్‌గౌడ్ నిలదీశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ కుంగిపో యిందని, దానికి హరీశ్‌రావు ఏమి సమాధానం చెపుతారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ చీఫ్ కవిత బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. ఒక రీజినల్ ( బీఆర్‌ఎస్ )పార్టీకి రూ.1400 కోట్లు ఎలా వచ్చాయని, బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడి జరిగినప్పడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడన్నారు.

ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేసి.. ప్రజల సొత్తును దుర్వినియోగం చేశారని, జరిగిన తప్పిదాలను ఈటల ప్రశ్నించలేదన్నారు. ఈటల మాట్లాడుతున్న తీరును చూస్తుంటే బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు  నడ్డా వచ్చినా, నబీన్ వచ్చినా.. ఏటా ఇస్తామన్న రెండుకోట్ల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రానికి రావాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయాని, అవన్నీ తొలగిపోతాయని తెలిపారు. కడియం శ్రీహరి, కొండ సురేఖ, తుంగతుర్తి పంచాయతీ విషయంలో సచిన్ సావంత్, జగ్గారెడ్డి ఇద్దరు విషయ సేకరణ చేసి పార్టీకి నివేదిక ఇస్తారని,  ఆ తరువాత చర్యలు ఉంటాయన్నారు. ఇద్దరు సీనియర్ నాయకులను అబ్జర్ వర్ లాగా నియమించామన్నారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌తో చర్చించి కార్పొరేషన్ పదవులపై నిర్ణయం తీసుకుంటామని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.