స్వరాజ్యంలో అస్పృశ్యత
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్న వేళ యావత్ దేశం సంబురాలకు సిద్ధమవుతున్నది. ఎనభై ఏళ్ల ఈ పయనంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, రాజ్యాంగ విలువలకు కట్టుబడిన దేశంగా అనేక ఘనతలకెక్కిన భారత్‌లో ఇంకా అస్పృశ్యత, కుల వివక్ష కొనసాగుతుండటం అత్యంత శోచనీయం. సమానత్వ స్ఫూర్తికి ప్రతీక లాంటి పార్లమెంట్ సాక్షిగా అంటరానితనం ఘటన వెలుగులోకి రావడం మరింత కలవరపెడుతున్న కలిగించే విషయం.
ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత స్వయంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించే వరకు ఈ ఘటన గురించి ప్రభుత్వానికి, పాలకులకు తెలియకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఓ కులాన్ని తక్కువగా చూడటం, వివక్షతో అవమానించడం ఆధునిక భారత సమాజానికి మాయని మచ్చలాంటిదని చెప్పక తప్పదు. భారతదేశం ఖండాంతరాలను దాటి అంతరిక్షాన్ని స్పృశిస్తున్న ఈ కాలంలోనూ అస్పృశ్యత ఘటనలు చోటుచేసుకోవడం హేయం.
కులం కారణంగా ఒక వ్యక్తి ప్రసంగించిన వేదికను శుద్ధిచేసిన వారు వాస్తవానికి శుద్ధి చేయాల్సింది ఆ వేదికను కాదు, మురికికూపాల్లాంటి వారి మెదళ్లను. అయితే, ఈ ఘటనలో కేంద్రంలోని అధికార పక్షం బీజేపీపై ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మాటల్లో చెప్పాలంటే, ఇది అధికారపక్ష కులాధిపత్య ధోరణికి, సైద్ధాంతిక భావజాలానికి, అణగారిన వర్గాల పట్ల వారికున్న చిన్నచూపునకు నిదర్శనం.
కాగా, విపక్ష నేత చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలను ఖండించిన కేంద్రంలోని అధికార పార్టీ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే, బాధితుడే స్వయంగా తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరేంత వరకు కనీసం కేసు నమోదు కాకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దారుణం. స్వాతంత్య్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కాదు.
ప్రతి పౌరుడూ గౌరవంగా, సమాన హక్కులతో జీవించే సమాజాన్ని నిర్మించడమే అసలైన స్వాతంత్య్రం. స్వతంత్ర భారతంలోనూ కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలు పూర్తిగా అంతం కాకపోవడం బాధాకరం. ఇది స్వతంత్ర పోరాట స్ఫూర్తిని మంటగలుపుతున్నది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం చూపిన సమానత్వ మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశం సాధించిన స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.






