60 వసంతాల కృష్ణ చైతన్యం
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్- ఇస్కాన్) ఈ పేరు నేడు ఒక ఆధ్యాత్మిక విప్లవానికి పర్యాయపదం, కృష్ణ చైతన్యానికి మారుపేరు. హరినామ సంకీర్తన ధ్యేయంగా, శ్రీమద్ భగవద్గీత పునాదిగా, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య మహా ప్రభు బోధనలు ఆలంభనగా ఇస్కాన్ విరాజిల్లుతోంది. ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ అనే మహామంత్రాన్ని భక్తులు నిత్యం వందలు, వేలసార్లు జపిస్తూ ధార్మిక జగత్తులో ఓలలాడుతున్నారు.
ఎ.సి.భక్తివేదాంత స్వామి ఈ సంస్థ వ్యవస్థాపక ఆచార్యులు. తదనంతరం వీరే శ్రీల ప్రభుపాదులుగా వ్యవహరింపబడ్డారు. ఇస్కాన్‌ను భక్తివేదాంత స్వామి 1966 జూలై 13న న్యూయర్క్‌లో ఏర్పాటు చేశారు. అలా ఈ సంస్థ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇటీవల ఉత్సవాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఇస్కాన్ స్థాపించాక వారు ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలను నెలకొల్పారు.
అందులో భాగంగా మన దేశంలో వారు తన స్వహస్తాలతో మాయాపూర్, కలకత్తా, బృందావనం, హైదరాబాద్‌లో ఇస్కాన్ మందిరాలను ప్రతిష్ఠించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని ఇస్కాన్- శ్రీ రాధా మదన మోహన మందిరాన్ని 1976 ఆగస్టు 18న ప్రతిష్ఠించారు. అంటే ఈనెల 18తో ఈ మందిరం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇస్కాన్ ఏర్పడి 60 సంవత్సరాలు, మరోవైపు ఇస్కాన్ హైదరాబాద్- అబిడ్స్ మందిరం ప్రతిష్ఠితమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా వీటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
భక్తివేదాంత స్వామి కలకత్తాలో 1896 సెప్టెంబర్ 1న సాంప్రదాయ గౌడియ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు అభయ్. ఉన్నత చదువులు ఒకవైపు, కృష్ణ భక్తి మరోవైపు అభయ్ సొంతం. సంప్రదాయంగా వచ్చిన భక్తితో పాటు వారి తండ్రి మోహన్ డే కున్న అపారమైన భక్తి వీరికి కూడా బాల్యం నుంచే అబ్బింది. అదే తదనంతర కాలంలో తన ఆధ్యాత్మిక ప్రయాణానికి బాటలు వేసింది.
తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా వేదాంత స్వామి 1922లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ‘ఆంగ్ల బాష తెలిసిన మీరు పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్య ప్రచారం చేయాలి’ అని ఠాకూర్ అభిలషించారు. అలాగే 1932లో సరస్వతి ఠాకూర్ మరోమారు వేదాంతస్వామికి ఒక సూచన చేశారు. అదేంటంటే... తన వద్ద డబ్బులు ఉంటే కృష్ణ చైతన్యం పుస్తకాలు ప్రచురించాలని, రచనలు చేయాలని.
1935లో వారి వద్దనే వేదాంతస్వామి దీక్ష తీసుకున్నారు. 1944లో కలకత్తా నుంచి ‘బ్యాక్ టు హెడ్’ పత్రికను ప్రారంభించారు. అనేక ఒదుదొడుకులు ఎదురైనప్పటికీ పత్రికను ప్రచురించారు. కృష్ణ చైతన్యం కోసం కృషిచేశారు. పత్రిక ప్రచురణ, కృష్ణ చైతన్యం లక్ష్యంగా ఢిల్లీకి తరుచుగా వెళ్లేవారు. ఎందరినో కలిసి సహకరించాలని అభ్యర్థించేవారు. చివరికి కృష్ణ ప్రచారం కోసం బృందావనానికి తన మకాం మార్చారు. అంతేకాకుండా 1959లో సన్యాసం స్వీకరించారు.
గురువు ఆజ్ఞ మేరకు పుస్తక ప్రచురణ, అనువాదం చేయటం ప్రారంభించారు. ఆశించిన రీతిలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగటం లేదని గుర్తించి అమెరికా వెళ్లి ప్రచారం చేయాలని తలంచారు. చేతిలో డబ్బులు లేవు. వెళ్లాక ఎక్కడ ఉండాలో తెలియదు. అయినా సంకల్పం చెక్కుచెదరలేదు. ఎట్టకేలకు సింధియా స్టీమ్ షిప్ లైన్ సంస్థ ఆధినేత్రి సుమతి మురార్జీని వేదాంతస్వామి ఒప్పించి, వారి సరుకు రవాణా షిప్‌లో ఒక సీట్‌ను ఉచితంగా సంపాదించారు.
అలా వారు 1965 ఆగస్టు 13న అమెరికాకు ప్రయాణమయ్యారు. 37 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 19న న్యూయార్క్ చేరుకున్నారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఉన్న గోపాల్ అగర్వాల్ ఇంటికి వెళ్లారు. అనంతరం అనేక ప్రదేశాలలో తిరుగుతూ కృష్ణ చైతన్య బోధనలు ఇవ్వసాగారు. ఎన్నో ఆటంకాలు, అవరోధాలను ఆధిగమించారు.
అమెరికాలో 9 నెలలకు పైగా నిర్విరామంగా కృష్ణ బోధనలు చేస్తూ, చివరకు కొంతమంది కళాకారులు, కృష్ణచైతన్యం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తుల తోడ్పాటుతో వేదాంతస్వామి ఒక ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నారు. న్యూయార్క్‌లోని సెకండ్ అవెన్యూ స్టోర్ ఫ్రంట్‌లో కృష్ణ సందేశాలు ఇవ్వడానికి హాల్, తాను నివాసం ఉండేందుకు ఒక గది గల భవనంలోకి తన మకాం మార్చారు. అక్కడి నుంచే కృష్ణ చైతన్య ప్రచారం, భజనలు, హరినామ సంకీర్తనలు, శ్రీమద్ భగవద్ గీత, భాగవతం, కృష్ణ సంబంధిత గ్రంథాలపై ప్రవచనాలు ఇచ్చారు.
ఈ యాత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు వారు 1966 జులై 13న ఇస్కాన్‌ను స్థాపించారు. పుస్తక రచనలు, అనువాదాలు, ప్రచురణల కోసం భక్తి వేదాంత బుక్ ట్రస్ట్‌ను నెలకొల్పారు. కృష్ణ చైతన్యాన్ని ఎంతగానో విస్తరించారు. శ్రీ అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి తదనంతరం శ్రీల ప్రభుపాదులుగా ప్రసిద్ధి చెందారు. ఎంతో మందికి దీక్షలు ఇచ్చారు. 70కి పైగా వైదిక గ్రంథాలు, కృష్ణ చైతన్య పుస్తకాలకు సంపుటాలు రచించారు, అనువదించారు.
వ్యాఖ్యనాలు రాశారు. వీరి గ్రంథాలు 95 భాషలలోకి అనువాదమయ్యాయి. భగవద్గీత యధాతథం, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామతం, భక్తి రసామతం, శ్రీ ఈషోపనిషత్తు, ఉపదేశామతం, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు వంటి సుప్రసిద్ధమైన గ్రంథాలు వాటిలో కొన్ని. ఇక శ్రీల ప్రభుపదులవారు కేవలం 11 సంవత్సరాల వ్యవధిలో 14 సార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చారు.
తన జీవితకాలం అంతా కృష్ణ సేవలో, ఆచార్యుల మార్గనిర్దేశంలో గడిపిన శ్రీల ప్రభుపాదులవారు 1977 నవంబర్ 14న తనువు చాలించారు. నేడు అనేక దేశాల్లో ఇస్కాన్ కృష్ణ మందిరాలున్నాయి. కోట్లల్లో ఇస్కాన్ భక్తులున్నారు. ఉచిత భోజన వితరణ, విద్యాసంస్థలు, గోశాలలు, గురుకులాలు, వర్ణాశ్రమాలు, సమాజ హితం కోసం పనులు చేస్తూ, మరోవైపు భక్తియుత సేవ చేస్తూ ఇస్కాన్ నేడు ఆధ్యాత్మిక భూలోక బృదావనంగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా జగన్నాథ రథ యాత్రలు అన్నిచోట్లా నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలలో ఇస్కాన్ కృష్ణ చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 900కు పైగా ఇస్కాన్‌ె రాధా కృష్ణ మందిరాలను నెలకొల్పారు. అనేక భాషలలో 75 కోట్ల భక్తి గ్రంథాల వితరణ జరిగింది. 600 కోట్ల ప్లేట్ల ఉచిత ప్రసాద భోజనాలు పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.2 కోట్ల మంది భక్తులు ఇస్కాన్ ఆలయాలను సందర్శిస్తున్నారు. భారతదేశంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది పిల్లలకు భోజనం అందుతున్నది.
వైద్య సేవల్లో భాగంగా ఇస్కాన్- ఆసుపత్రులు, వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 3.4 లక్షల మంది సేవ పొందారు. 1967 నుంచి ఇప్పటివరకు సుమారు లక్ష మంది భక్తులు అధికారిక ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 6,000 కృష్ణ చైతన్య ఉత్సవాలు జరుగుతున్నాయి.
శ్రీ రాధా మదన మోహన మందిరానికి 50 ఏళ్లు: హైదరాబాద్‌లోని ఇస్కాన్ శ్రీశ్రీ రాధా మదన మోహన మందిరం స్వర్ణోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీల ప్రభుపాదులు 1976 ఆగస్టు 18న ఈ మందిరంలో శ్రీశ్రీ రాధా మదన మోహన, శ్రీశ్రీ గౌర నితాయి, శ్రీశ్రీ జగన్నాథ, సుభద్ర, బలదేవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 50 ఏళ్ల ప్రస్థానాన్ని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఆగస్టు 15, 16, 17, 18వ తేదీలలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 5 లక్షల భోజనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తారు. 50 ఏళ్ల ప్రస్థానంలో సేవలందించిన వారికి సత్కారం చేయాలని నిర్ణయించారు.
శ్రీల ప్రభుపాదుల వారి భక్తియుత నిస్వార్థ సేవ: భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను, భౌతిక సంపదలను వదిలి 70 ఏళ్ల వయస్సులో రెండుసార్లు గుండెపోటుకు గురైనప్పటికీ గురువు ఆదేశాలను శిరసావహించి చెక్కు చెదరని కృష్ణ విశ్వాసంతో శ్రీల ప్రభుపాదుల వారు నౌకలో ప్రయాణం చేశారు. అమెరికాలో ప్రతికూ ల పరిస్థితుల్లోనూ అక్కడి వారిని, ముఖ్యంగా యువత ను కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం మామూలు విష యం కాదు. సరళమైన జీవనం, నిస్వార్థ భక్తి, సేవ, కార్యదీక్షత, సాధించాలనే పట్టుదల వారి జీవితం నుంచి మనకు సదా ఆదర్శనీయమైనవి.
డి.శ్రీనివాస్






