6 April, 2026 | 3:23 AM

డిజిటల్ పల్లెలు!

06-04-2026 01:37 AM

తెలంగాణ గ్రామాలకు గ్లోబల్ టచ్

  1. టీ ప్రాజెక్టుతో సరికొత్త విప్లవం
  2. గ్రామం నుంచి గ్లోబల్ దాకా కనెక్టివిటీ
  3. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్‌నెట్ 
  4. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి 
  5. విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో మార్పు
  6. గ్రామీణ భారతానికి టెక్నాలజీ చేరువ చేసే మాడల్ 
  7. డిజిటల్ డివైడ్‌కు చెక్.. సమాన అవకాశాలకు వేదిక
  8. ఒకే కనెక్షన్‌తో సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
  9. టీ మాడల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఒకప్పుడు గ్రామాల్లో ఇంటర్‌నెట్ అంటే ఒక కల.. నగరాలకు మాత్రమే పరిమితమైన సౌకర్యం. కానీ ఇప్పుడు అదే కనెక్టివిటీ గ్రామీణ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తున్న శక్తిగా అవతరించింది. టీవీ ముందు కూర్చున్న విద్యార్థి ప్రపంచస్థాయి డిజిటల్ క్లాస్ వింటున్నాడు. రైతు తన పొలంలో నుంచే మార్కెట్ ధరలు, వాతావరణ అంచనాలు తెలుసుకుంటున్నాడు.

గ్రామం విడిచి వెళ్లకుండా రోగి నిపుణుడైన వైద్యుడితో మాట్లాడుతున్నాడు. ఇంటర్‌నెట్ ఇక విలాసం కాదు ---అభివృద్ధికి, అవకాశాలకు, సమగ్ర ప్రగతికి మౌలిక హక్కుగా మారింది. ఈ మార్పును ఆచరణలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న టీ ప్రాజెక్ట్, గ్రామం నుంచి గ్లోబల్ స్థాయికి ప్రజలను అనుసంధానిస్తూ డిజిటల్  అంతరాలను చెరిపేస్తున్నది.

కనెక్టివిటీని మాత్రమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పాలన, ఆర్థికరంగాల్లో విస్తృత మార్పుకు దారితీస్తూ, రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీ వైపు దూసుకెళ్లించే బలమైన పునాదిగా అవతరిస్తున్నది. ఒక్క కనెక్షన్‌తో ప్రపంచాన్ని చేరుకునే సామర్థ్యాన్ని ప్రతి గడపకు తీసుకువస్తూ, టీ తెలంగాణలో డిజిటల్ విప్లవానికి నూతన అధ్యా యం లిఖిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్‌వర్క్

డిజిటల్ అభివృద్ధికి బలమైన పునాది మౌలిక వసతులే అన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం టీ- ప్రాజెక్ట్ కింద భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. సుమారు 43,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ విస్తరణ ద్వారా జిల్లాలు, మండలాలు, గ్రామాలను ఒకే డిజిటల్ మౌలిక వేదికపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం ఇంటర్‌నెట్ సదుపాయం విస్తరణ మాత్రమే కాకుండా, భవిష్యత్తు డిజిట ల్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సమగ్ర మౌలిక వ్యవస్థగా నిలుస్తున్నది.

గ్రామీణ ప్రాంతాల వరకు హైస్పీడ్ కనెక్టివిటీ చేరేలా ప్రణాళిక అమ లుకావడం, దేశంలోనే అరుదైన మోడల్‌గా నిలుస్తున్నది. ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, రైతు వేదికలు ఒకే డిజిటల్ ఎకోసిస్టమ్‌లోకి రావడం వల్ల సేవల అందుబాటు, అమలు వేగం గణనీయంగా పెరుగుతున్నది. ఈ -గవర్నెన్స్ సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి రావ డం, పౌరులకు సౌలభ్యంగా ఉండటమే కాకుండా, పాలనలో పారదర్శకతను కూడా పెంచుతున్నది. ఫైబర్ నెట్‌వర్క్, తెలంగాణలో డిజిటల్ విప్లవానికి మూలస్తంభంగా మారి, రాష్ట్రాన్ని భవిష్యత్తు టెక్నాల జీ అవసరాలకు సిద్ధం చేస్తున్నది.

ఆర్థిక వృద్ధికి డిజిటల్ డ్రైవ్

డిజిటల్ కనెక్టివిటీ కేవలం సమాచార మార్పిడికే పరిమితం కాదు. అది నేటి ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన ఇంధనంగా మారింది. ఈ నేపథ్యంలో టీ- ప్రాజెక్ట్ తెలంగాణలో ఆర్థిక వృద్ధికి కొత్త దిశను చూపుతున్న కీలక మౌలిక వేదికగా అవతరిస్తున్నది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం బ్రాడ్ బ్యాండ్ వినియోగం 10 శాతం పెరిగితే జీడీపీ సుమారు 2 శాతం పెరిగే అవకాశముంది.

ఈ నేపథ్యంలో టీ విస్తరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణతో చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా యి. ఈ -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గ్రామీణ ఉత్పత్తులు నేరుగా మార్కెట్‌కు చేరే అవకాశం లభిస్తున్నది. అదేవిధంగా, డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగడం వల్ల నగదు ఆధారిత లావాదేవీలు తగ్గి, పారదర్శక ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తున్నది.

గ్రామీణ యువతకు ఫ్రీలాన్సింగ్, రిమోట్ జాబ్స్, ఆన్‌లైన్ సేవల రంగంలో అవకాశాలు విస్తరించడం ద్వారా ఉపాధి రంగంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. స్టార్టప్ సంస్కతి గ్రామీణస్థాయికి విస్తరించే అవకాశాలు పెరుగుతున్నాయి. టీ -ఫైబర్ కనెక్టివిటీతో ప్రభుత్వ సేవలు డిజిటలైజ్ కావడం వల్ల వ్యాపార అనుమతులు, రిజిస్ట్రేషన్లు, పన్నుల చెల్లింపులు వంటి ప్రక్రియలు వేగవంతమవుతున్నాయి.

ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు మద్దతు ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షించే వాతావరణాన్ని సృష్టిస్తున్న ది. టీ -ఫైబర్ ప్రాజెక్ట్ తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని ఆర్థిక శక్తిగా మలుస్తూ, గ్రామం నుంచి పట్టణస్థాయి వరకు సమగ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నది. భవిష్యత్తులో డిజిటల్ ఎకానమీ విస్తరణలో ఇది కీలక పాత్ర పోషించనున్నది.

విద్యలో విప్లవాత్మక మార్పులు

డిజిటల్ యుగంలో విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, సాంకేతికతతో కలిసిపోయిన సమగ్ర అభ్యాస ప్రక్రియగా మారుతున్నది. ఈ మార్పును వేగవంతం చేయడంలో టీ ప్రాజెక్ట్ రాష్ట్రం లో కీలక పాత్ర పోషిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంలో ఇది ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తున్నది. టీ కనెక్టివిటీతో ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ క్లాస్ రూమ్స్‌గా మారుతున్నాయి.

రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే మొదటి దశలో 2 వేల పాఠశాలలకు కనెక్టివిటీ కల్పించే ప్రక్రియ ప్రారంభించగా, రాబోయే రోజుల్లో మరిన్ని విద్యాసంస్థలకు విస్తరించనున్నది. దీని వల్ల విద్యార్థులు లైవ్ ఆన్‌లైన్ క్లాసులు, రికార్డ్ చేసిన వీడియో పాఠాలు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్లు సులభంగా వినియోగించగలుగుతున్నారు. ఉపా ధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ కంటెంట్ ద్వారా బోధన కొనసాగించడం సాధ్యమవుతున్నది. టీ ద్వారా అందుబాటులోకి వస్తున్న హైస్పీడ్ ఇంటర్‌నెట్, ఏఐ ఆధారిత విద్యను కూడా ప్రోత్సహి స్తున్నది.

విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాలు సూచించే స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ వినియోగంలోకి వస్తున్నాయి. కోడింగ్, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ స్కిల్స్ వంటి ఆధునిక నైపుణ్యాలను గ్రామీణ విద్యార్థులు కూడా నేర్చుకునే అవకాశాలు పెరు గుతున్నాయి. ఇంట్లో కంప్యూటర్ లేకపోయినా, వర్చువల్ డెస్క్‌టాప్ సదుపాయం ద్వారా పేద, గ్రామీణ కుటుంబాల విద్యార్థులు కూడా డిజిటల్ లెర్నింగ్‌లో వెనుకబడకుండా చేసి డిజిటల్ అసమానతను తగ్గించే కీలక పరిష్కారంగా నిలుస్తున్నది. టీ కనెక్టివిటీ విద్యార్థులకు ఎప్పుడైనా, ఎక్కడైనా చదివే అవకాశాన్ని అందిస్తున్నది.

పరీక్షలు, అసైన్‌మెం ట్లు, ప్రాజెక్టులు డిజిటల్ మాధ్యమాల ద్వారా నిర్వహించగలుగుతున్నారు. గ్రామీణ విద్యార్థులకు గ్లోబల్ స్థాయి అవకాశాలను అందు బాటులోకి తెస్తూ, భవిష్యత్తు నైపుణ్యాలతో కూడిన కొత్త తరం రూపుదిద్దుకునే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తున్నది.

వ్యవసాయానికి సాంకేతిక మద్దతు.. 

సంప్రదాయ పద్ధతులపై ఆధారపడి ఉన్న వ్యవసాయం, ఇప్పుడు సమాచార ఆధారిత నిర్ణయాల దిశగా మారుతున్నది. ఈ మార్పునకు టీ- కనెక్టివిటీ ప్రధాన బలంగా నిలుస్తున్నది. గ్రామీణ ప్రాంతాల వరకు హైస్పీడ్ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో, రైతులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందే అవకాశం ఏర్పడింది.

టీ- ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది రైతు వేదికలు డిజిటల్‌గా అనుసంధానమవుతున్నాయి. దీనివల్ల రైతులు మార్కెట్ ధరలు, డిమాండ్-, సప్లయ్ పరిస్థితులు, వాతావరణ అంచనాలు వంటి కీలక సమాచారాన్ని రియ ల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. ఈ సమాచారం ఆధారంగా పంటల ఎంపిక, విక్రయ నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతున్నది.

అదేవిధంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ వినియోగం వ్యవసాయంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పంటల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తే, వ్యాధు ల గుర్తింపు, చికిత్స సూచనలు ఇవ్వగలిగే సిస్ట మ్స్ రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. వాతావరణ డేటా, నేల పరిస్థితుల ఆధారంగా పంట దిగుబడిని అంచనా వేసే సాంకేతికతలు రైతుల నిర్ణయ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

టీ- ద్వారా వ్యవసా య విస్తరణాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా అనుసంధానమ వుతున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్, డిజిటల్ సలహా కేంద్రాల ద్వారా రైతులు తమ సందేహాలకు వెంటనే సమాధానాలు పొందగలు గుతున్నారు. ఇది పంట నష్టాలను తగ్గించడంలో కీలకంగా మారుతున్నది. మరోవైపు, ప్రభుత్వ వ్యవసాయ పథకాల సమాచారం, సబ్సిడీలు, బీమా వివరాలు కూడా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రైతులకు సులభంగా చేరుతున్నాయి.

దరఖాస్తు ప్రక్రియలు ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకునే అవకాశం ఉండటంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవ సరం తగ్గుతున్నది. ఈ విధంగా టీ ప్రాజెక్ట్ వ్యవసాయరంగాన్ని స్మార్ట్ అగ్రికల్చర్ వైపు మలుస్తున్నది. సమాచారం, సాంకేతికత, డిజిటల్ సేవల సమన్వయంతో రైతులు మరింత అవగాహనతో, లాభదాయకంగా వ్యవసాయం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది కీలక మద్దతుగా నిలుస్తున్నది.

అందుబాటులోకి టెలీమెడిసిన్

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవ లు అందుబాటులో లేకపోవడం చాలా కాలం గా ఉన్న సమస్య. నిపుణులైన వైద్యులను కలవాలంటే పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రయాణ ఖర్చులు, సమయం వంటివి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్‌నెట్ విస్తరణతో ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నది. టీ కనెక్టివిటీతో తెలంగాణలో టెలీమెడిసిన్ సేవ లు గ్రామాల వరకు విస్తరించి, వైద్యరంగంలో కొత్త దశకు నాంది పలుకుతున్నది.

టెలీమెడిసిన్ అనేది డిజిటల్ సాంకేతికత ఆధారంగా డాక్టర్, రోగి మధ్య జరిగే వైద్య సంప్రదింపుల ప్రక్రియ. వీడియో కాల్స్, ఆన్‌లైన్ కన్సల్టేషన్లు, డిజిటల్ మెడికల్ రిపోర్టులు, ఈ ద్వారా వైద్య సేవలు అందించవచ్చు. ఈ విధానానికి అవసరమైన హైస్పీడ్, స్థిరమైన ఇంట ర్‌నెట్ కనెక్టివిటీని టీ సమర్థంగా అందిస్తున్నది. టీ నెట్‌వర్క్ ద్వారా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆసుపత్రులు నగరాల్లోని స్పెషలిస్ట్ వైద్యులతో అనుసంధానమవుతున్నాయి.దీని వల్ల కార్డియాలజీ, డెర్మ టాలజీ వంటి ప్రత్యేక వైద్య సలహాలు కూడా గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వస్తున్నా యి.

టెలీమెడిసిన్ విస్తరణతో గ్రామీణ ప్రజలకు ప్రయాణ, వసతి ఖర్చులు తగ్గడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతున్న ది. పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి కొంత తగ్గే అవకా శం ఉన్నది. మరోవైపు, ప్రభుత్వ ఆరోగ్య సేవల అమలులో కూడా ఈ డిజిటల్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, డేటా సేకరణ, విశ్లేషణ వేగవంతంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో డిజిటల్ హెల్త్ రికార్డులు, ఏఐ ఆధారిత నిర్ధారణ వ్యవస్థలు మరింత విస్తరించే అవకాశమున్నది. 

పాలనలో పారదర్శకత కోసం సిటిజన్ ఫీడ్‌బ్యాక్

పారదర్శకత, బాధ్యతాయుత పాలన--- వంటివి ఆధునిక ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత కీలక అంశాలు. ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా స్పందించే అవ కాశం కల్పించడం ద్వారా మాత్రమే నిజమైన పాలన సాధ్యమవుతుంది. ఈ దిశగా టీ- కనెక్టివిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్, పాలనలో కొత్త పారదర్శకతను తీసుకొస్తున్నది.

గ్రామం నుంచి నగరం వర కు ప్రతి పౌరుడు తనకు అందిన ప్రభుత్వ సేవలపై వెంటనే స్పందించే అవకాశం ఈ వ్యవస్థ కల్పిస్తున్నది. రేషన్, పెన్షన్, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు వంటి విభి న్న రంగాల్లో సేవల నాణ్యతపై ప్రజలు తమ అభిప్రాయాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నమోదు చేయగలుగుతున్నారు. మొబైల్ యాప్‌లు, కాల్ సెంటర్లు, ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరణ జరుగుతున్నది.

ఈ డేటా నేరుగా ఉన్నతాధికారుల వరకు చేరడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. మధ్యవర్తుల ప్రమేయం తగ్గడం వల్ల సమాచారం వక్రీకరణకు అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించారు. దీంతో సేవల పంపిణీపై పర్యవేక్షణ మరింత కఠినంగా మారుతున్నది. సమస్యాత్మక ప్రాంతాలు, సేవల లోపాలు స్పష్టంగా గుర్తించబడుతున్నాయి. 

ఏ శాఖలో, ఏ ప్రాంతంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టవచ్చు. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడంలో కూడా ఈ సిస్టమ్ కీలకంగా మారుతున్నది. ప్రజలు తమ అభిప్రాయానికి విలువ ఉందనే నమ్మకం పెరగడం వల్ల, పాలనపై విశ్వాసం కూడా పెరుగుతున్నది. ప్రభుత్వంపై జవాబుదారీతనం పెరగడంతో పాటు అవినీతి అవకాశాలు తగ్గే అవకాశముంది. టీ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సౌకర్యం విస్తరించడం వల్ల, ఇప్పటివరకు తమ సమస్యలు చెప్పుకోలేని వర్గాలకు కూడా అవకాశం లభిస్తున్నది. 

అంతర్జాతీయ గుర్తింపు.. ఇతర రాష్ట్రాలకు-- ఆదర్శం 

గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ అందించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా నిలు స్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న టీ ప్రాజెక్ట్, తన వినూత్న రూపకల్పన, విస్తృత లక్ష్యాల తో అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నది. డిజిటల్ డివైడ్‌ను తగ్గిస్తూ, సమగ్ర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది ఆదర్శ ప్రాజెక్ట్‌గా నిలుస్తున్నది.

ఇది కేవలం ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. మౌలిక వసతుల నిర్మా ణం నుంచి సేవల పంపిణీ వరకు సమగ్ర దృష్టితో రూపొందించిన డిజిటల్ ఎకోసిస్టమే టీ ప్రత్యేకత. అంతర్జాతీయ సంస్థలు, పాలసీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పెద్దస్థాయిలో కనెక్టివిటీ అందిం చే విధానం, ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల ను వినియోగించుకునే ఆలోచన, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి--- ఇతర దేశాలకు కూడా అనుసరణీయంగా మారుతున్నాయి.

డిజిటల్ సమానత్వాన్ని సాధించడంలో టీ చూపిస్తున్న మార్గం అభివృద్ధి చెందు తున్న దేశాలకు ఒక మోడల్‌గా నిలుస్తున్నది. ఇంటర్‌నెట్ యాక్సెస్‌ను మౌలిక హక్కుగా పరిగణిస్తూ, ప్రతి ఇంటికి కనెక్టివిటీ అం దించే లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో టీ- ఫైబర్ వంటి ప్రాజెక్టులు భవిష్యత్తు డిజిటల్ పాలనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

ఈ ప్రాజె క్ట్ ద్వారా సాధ్యమవుతున్న సామాజిక- ఆర్థిక మార్పులు కూడా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెరగడం, ఆరోగ్య సేవలు మెరుగుపడటం, ఉపాధి అవకాశాలు విస్తరించడం--- డిజిటల్ కనెక్టివిటీ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ విధంగా టీ ప్రాజెక్ట్, తెలంగాణను డిజిటల్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ప్రపంచానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నది. సాంకేతికతను సమాజ మార్పుకు వినియోగించే విధానంలో ఇది ఒక విజయవంతమైన మోడ ల్‌గా గుర్తింపు పొందుతున్నది.

‘టీవీనే కంప్యూటర్’గా కొత్త మోడల్..

డిజిటల్ యుగంలో ముందుకు సాగాలంటే కంప్యూటర్, ఇంటర్‌నెట్ వంటి వన రులు తప్పనిసరి. అయితే గ్రామీణ ప్రాం తాల్లో ఇప్పటికీ ప్రతి ఇంటికి కంప్యూటర్ అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. ఈ అసమానతను తగ్గించేందుకు టీ ప్రాజెక్ట్ వినూత్నంగా తీసుకొచ్చిన పరిష్కారమే ‘టీవీనే కంప్యూటర్’ మోడల్. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (వీడీఐ) ఆధారంగా పనిచేసే ఈ విధానంలో, సాధారణ టెలివిజన్‌ను కంప్యూటర్‌గా మార్చే అవకాశం కల్పిస్తున్నారు.

టీ కనెక్టివిటీతో ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ చేరు తుండగా, సెటాప్ బాక్స్ లేదా ప్రత్యేక డివైస్ ద్వారా టీవీకి అనుసంధానం చేస్తారు. వినియోగదారు లాగిన్ అయిన వెంటనే క్లౌడ్ లో ఉన్న వర్చువల్ డెస్క్‌టాప్ టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. కీబోర్డ్, మౌస్ సహాయంతో సాధారణ కంప్యూటర్‌లాగే వర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్, బ్రౌజింగ్, విద్యా అప్లికేషన్ల వినియోగం సాధ్యమవుతుంది. దీంతో కంప్యూ టర్ కొనుగోలు చేయలేని కుటుంబాల్లో కూడా పిల్లలు డిజిటల్ లెర్నింగ్, ఆన్‌లైన్ క్లాసులు, కోడింగ్, ఏఐ టూల్స్ వినియోగించగలుగుతున్నారు.

ప్రభుత్వ సేవలు విని యోగించడం, ఆన్‌లైన్ దరఖాస్తులు, డిజిటల్ డాక్యుమెంట్ల యాక్సెస్, బ్యాంకింగ్ సేవలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వస్తాయి. దీంతో గ్రామీణ ప్రజలు మీసేవ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవస రం తగ్గుతుంది. ‘టీవీనే కంప్యూటర్’ విధా నం కేవలం సాంకేతిక పరిష్కారం మాత్రమే కాదు.. ప్రతి ఇంటిని డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించే సమగ్ర మార్గంగా, తెలంగాణలో డిజిటల్ సమానత్వానికి కొత్త దిశను చూపుతున్నది.

భద్రతలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం

డిజిటల్ యుగంలో భద్రతా వ్యవస్థ లు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా రూపాంతరం చెందుతు న్నాయి. సంప్రదాయ నిఘా విధానాల నుంచి స్మార్ట్ మానిటరింగ్, రియల్ టైమ్ డేటా విశ్లేషణ వరకు భద్రతా వ్యవస్థలు మరింత సమర్థవంతంగా మారుతున్నా యి. ఈ మార్పులో టీ వంటి హైస్పీడ్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సీసీటీ వీ కెమెరాలు, సర్వైలెన్స్ సిస్టమ్స్--- ఇప్పుడు హైస్పీడ్ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష ప్రసారం (లైవ్ ఫీడ్) ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడం, అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించడం సాధ్యమవుతు న్నది.

నగరాలకే పరిమితమైన ఈ సదుపాయాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఒక ముఖ్యమైన పరిణామం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫేషియల్ రికగ్నిషన్, వీడియో అనలిటిక్స్ వంటి సాంకేతికతలు భద్రతా వ్యవ స్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ట్రాకింగ్ చేయడం, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించడం వంటి అనేక అంశా ల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతున్నది. పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, ఫీల్డ్ సిబ్బంది మధ్య సమన్వయం హైస్పీడ్ నెట్‌వర్క్ ద్వారా మరింత సమర్థవంతంగా మారు తున్నది.

కాల్ డేటా, లొకేషన్ ట్రాకింగ్, వీడి యో ఫుటేజ్--- సమయానుకూలంగా అందుబాటులోకి రావడం వల్ల చర్యలు వేగంగా తీసుకోవచ్చు. ప్రజాభద్రత సేవ లు కూడా డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ యాప్‌లు, ఆన్‌లైన్ ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా ప్రజలు పోలీస్ సేవలను సులభంగా వినియోగించగలుగుతున్నా రు. మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో కూడా స్మార్ట్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తున్నది. మరోవైపు, డేటా భద్రత, ప్రైవసీ అం శా లు కూడా ప్రాధాన్యం పొందుతున్నాయి.

సాంకేతిక వినియోగం పెరుగుతున్న కొద్దీ, వ్యక్తిగత సమాచార రక్షణకు కట్టుదిట్టమైన విధానాలు అవసరం అవుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం సరైన నిబంధనలు, పర్యవేక్షణ వ్యవస్థలను అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో స్మార్ట్ సిటీస్, స్మార్ట్ విలేజ్‌ల నిర్మాణంలో ఈ టెక్నాలజీ కీలక ఆధారం గా నిలిచే అవకాశం ఉన్నది.

ఒక్క కనెక్షన్‌తో సేవలు అనేకం

ఒకే ఇంటర్‌నెట్ కనెక్షన్‌తో అనేక సేవ లు పొందడం--- ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సౌకర్యం. కానీ ఇప్పుడు టీ- ఫైబర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఈ సదుపాయం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తు న్నది. ఈ విధానంలో డిజిటల్ కనెక్టివిటీని కేవలం ఇంటర్‌నెట్ యాక్సెస్‌కే పరిమితం కాకుండా, సమగ్ర సేవల వేదికగా మారుస్తున్నది. ఈ ఒకే కనెక్షన్ ద్వారా ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్, ఐపీటీవీ, టెలీమెడిసిన్, ఈ ఈ- సేవలు--- ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.

విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ లైబ్రరీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందుబాటులోకి వస్తుంటే, రైతులకు మార్కెట్ సమాచారం, వాతావరణ అంచనాలు, వ్యవసాయ సలహాలు అందుతున్నాయి. ఇదే సమయం లో కుటుంబాలకు వినోదం కోసం ఐపీటీ వీ సేవలు, ఆరోగ్య అవసరాలకు టెలీమెడిసిన్, ప్రభుత్వ సేవల కోసం ఆన్‌లైన్ పోర్ట ల్--- ఒకే కనెక్షన్ ద్వారా అందుబాటులోకి రావడం దీని ప్రత్యేకత. ప్రభుత్వ సేవల వినియోగంలో కూడా ఈ మోడల్ విప్లవాత్మక మార్పుకు దారితీస్తున్నది.

ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్ దరఖాస్తులు, భూ రికార్డులు వంటి సేవలు ఇంటి నుంచే పొందే అవకాశం కలుగుతున్నది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస రం తగ్గి, సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సమ గ్ర కనెక్టివిటీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తరించే అవకాశం ఉన్నది. ఈ- డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగడం ద్వారా గ్రామీణ మార్కెట్లు విస్తరించే దిశగా సాగుతున్నాయి.