6 April, 2026 | 2:45 AM

అందని మద్దతు ధర.. తీరని రైతు వ్యథ

07-04-2026 12:00 AM
  1. సిండికేట్‌గా మారి దోచుకుంటున్న మిల్లర్లు                    
  2. దిగుమతుల పేరిట భారీ దోపిడీ కొరవడిగా అధికారుల 
  3. పర్యవేక్షణ ఆందోళనలో అన్నదాత

మిర్యాలగూడ, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ ఆయకట్టు, ఆయకట్టేతర  ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతుల సన్న ధాన్యం కొనుగోళ్లలో  మిల్లర్లు సిండికేట్ గా మారి  పచ్చగింజ పేరుతో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకే  కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ లో 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టిన రైతులు అందులో 30శాతం  సన్న రకం,70 శాతం దొడ్డు రకం వడ్లను పండించారు.                 

తగ్గుతున్న ధర : సన్నరకం దాన్యం కొనుగోళ్ల ప్రారంభ సమయంలో క్వింటాలుకు  రూ.2600 నుండి 2700 ధర పెట్టిన మిల్లర్లు కొద్ది కాలానికే సిండికేట్ గా మారి మహేంద్ర చింట్లు, కే ఎల్ ఎన్ (50205) ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతూ క్వింటాకు రూ.2180 -2300 మధ్య ధర మాత్రమే పెట్టి రైతులను నిలువుగా దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు మూలిగే నక్కపై తాటి పండు పడ్డచందంగా ప్రతి లోడుకు 30 కిలోలను తరుగు పేరుతో తీస్తూ దిగుమతి రుసుము, హమాలి చార్జెస్, గుమస్తా రుసుము తదితర పేర్లతో ప్రతిలోడుకు 1500 నుండి 2000 వరకు అదనంగా వసూలు చేస్తూ అన్నదాత కష్టాన్ని జలగల్లా పిలుస్తున్నారన్నారు. 

కొరవడిన అధికారుల పర్యవేక్షణ..

మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని ప్రతి రైస్ మిల్లు ఇదే తంతు కొనసాగుతుండగా వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, రెవెన్యూ పోలీస్ శాఖల నిఘా కొరవడ డంతో  మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని రకాల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరించడంతో రైతులు దిక్కుతోచని కొట్టుమిట్టాడుతున్నారు. గత్యంతరం లేని  పరిస్థితుల్లో ఎంతకు కొంతకు ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు.                 

తూకాల్లోనూ తేడాలు : ధరలు తగ్గడంతో నష్టపోతున్న రైతన్నలకు వేబ్రిడ్జ్ లో తూకాల తేడాతో మరిత నష్టం కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే ఇప్పటివరకు తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ట్రాక్టర్ లోడును రెండు వేరువేరు వేబ్రిడ్జిలపై తూకాలు వేసినప్పుడు వేరువేరుగా రావడం తూకాలలో తేడాలు ఉంటాయని చెప్పడానికి నిదర్శనమని రైతులు చెబుతున్నారు.                

దొడ్డు రకాలతో మరింత గుబులు..

దొడ్డు రకాలను పండించినటువంటి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారయింది. దొడ్డు రకం కొనుగోళ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు.

మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఎక్కువ మొత్తము విస్తీర్ణంలో సాగుచేసిన కే ఎల్ ఎన్ రకం  ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరించడంతో స్థానిక రైతులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వారి జోక్యంతో మద్దతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.

ఇంత జరుగుతున్నా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ రైతుల బాధలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

వడ్ల అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి                          

ధాన్యమును అమ్మేందుకు మిల్లుల వద్దకు తీసుకువెళ్తే ఏదో ఒక కారణాన్ని చూపుతూ రేటు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రైతులు పచ్చి వడ్లను కోసుకొని నేరుగా మిల్లులకు వస్తున్నారు. దీంతో మిల్లర్లంతా కలిసిపోయి  రేటు తక్కువకే అడుగుతున్నారు.

ఆ వడ్లను ఆరోజు అమ్మకుంటే అవి రంగు మారి మరింత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దీంతో తప్పని పరిస్థితిలో మిల్లర్లు అడిగిన రేటుకి వడ్లు అమ్మాల్సి వస్తుంది. అందుకే అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలనలు చేస్తూ తక్కువ ధరకు వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకొని రైతులకు వడ్ల అమ్మకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.

- బంటు శ్రీను, రైతు, శెట్టిపాలెం.