6 April, 2026 | 3:24 AM

కాంగ్రెస్ గద్దలు

06-04-2026 01:30 AM

7 వేల కోట్ల సర్కారు భూమిలో

  1. నాదర్‌గుల్‌లో 373 ఎకరాల భూమి అన్యాక్రాంతం
  2. కుంభకోణం వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం
  3. కబ్జాలను హైడ్రా పట్టించుకోవడం లేదు..
  4. సీఎం తక్షణం స్పందించాలి.. కబ్జాదారులను అరెస్ట్ చేయాలి
  5. రైతులను భూముల్లోకి అనుమతించాలి 
  6. ముఖ్యమంత్రి, హైడ్రా స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఉద్యమం తథ్యం
  7. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ సర్కార్‌లో ప్రభుత్వపెద్దలు గద్దల్లా దళితులు, బలహీన, వెనుకబడినవర్గాల భూములపై వాలి తన్నుకుపోతున్నారు. కొందరు పారిశ్రామికవేత్తల ముసుగులో దోచు కుంటే, మరికొందరు కబ్జా చేసి భూములను దోచుకుంటున్నారు. తాజాగా నాదర్‌గుల్‌లోని సర్వేనంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లోని 373 ఎకరాల భూమి హాంఫట్ అయింది. ఇక్కడ రూ.7 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది.

కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాదర్‌గుల్ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించాలని 2007లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారని, దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ భూములను ప్రభుత్వ భూములుగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. తర్వాత, ఆయా భూములను ఏపీఐఐసీకి అప్పగించారని కూడా స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్, నాదర్‌గుల్ భూములను కంటికి రెప్పలా కాపాడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్‌రెడ్డి కన్ను ఆ భూములపై పడిందని ఆరోపించారు. ఆయా భూముల్లో 600 మంది నిరుపేద రైతులు తమ తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఇప్పుడు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్స ర్లు, రౌడీలను పెట్టి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నదని మండిపడ్డారు. పోలీసులతో సదరు రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌసల్య, మమత అనే మహిళా రైతుల కుటుంబాలు 40 ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్నాయని, వారికి రూ. 5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఆశచూపి, ఆ భూముల నుంచి వెళ్లగొట్టాలనే ప్రయత్నాలు జరుగతున్నాయని తెలిపారు. గూండాలు ఇప్పటికే అనేక బోర్లు, కంచెలు ధ్వంసం చేశారని వివరించారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని నిప్పులు చెరిగా రు.

నాదర్‌గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతున్నారని, 2005లోనే అప్పటి ఆర్డీవో ఆ భూములను ప్రభుత్వ భూములుగా అని స్పష్టం చేశారని గుర్తుచేశారు. 2017లో సుప్రీంకోర్టు కూడా ఆ భూమి ప్రభుత్వానిదేనని చెప్పిందని, రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, కానీ.. 2016 లో శివరాజ్ బహదూర్ ఆ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించారని వెల్లడించారు.

చట్టంలోని సెక్షన్  17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయా చట్టాల ప్రకారం ఆ భూముల విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉంటాయని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారని గుర్తుచేశారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా, ఆర్డీవో నిర్ణయమే సరైనదని, భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టం చేశాయని తేల్చిచెప్పారు. అమ్మిన వారిపై క్రిమిన ల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూ చించిందన్నారు.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ప్రస్తు తం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద కేసు ఈ ఏడాది ఏప్రిల్ 7 విచారణకు పెండింగ్‌లో ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదని, కాబట్టి హైకోర్టు తీర్పే చివరిదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ అది ప్రభుత్వ భూమి అని ఉందని వెల్లడించారు.

తక్షణం సీఎం చర్యలు తీసుకోవాలి.. 

భూభారతి వెబ్‌సైట్‌లో చూసినా నాదర్‌గుల్ భూములు ప్రభుత్వ భూములేనని, అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ గానే చూపిస్తోందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇంత స్పష్టమైన కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నప్పటికీ ఆర్డీవో కళ్లు మూసుకున్నారని విమర్శించారు. మార్చి 9, 10 తేదీల్లో రైతులు కందుకూరు ఆర్డీవో, ఎమ్మార్వో, రంగారెడ్డి కలెక్టర్‌తోపాటు చివరకు హైడ్రాకు కూడా ఆక్రమణలపై వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తే, ఈ రేవంత్‌రెడ్డి రాజ్యం గుండాలతో ఆ భూములను గుంజుకుంటున్నదని మండిపడ్డారు. ‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గుండా లు, రౌడీలు ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు వస్తున్నారు? దీని వెనుక ఉన్న దొంగలు ఎవరో స్పష్టమవుతున్నది’ అని వ్యాఖ్యానించారు. వార్తా పత్రికల్లో వార్తలు వచ్చినా, పేద రైతులు వెళ్లి దరఖాస్తులు ఇచ్చినా హైడ్రా కళ్లు మూసుకుందంటే, రాష్ట్రంలో పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం ఉందనేది స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

శని, ఆదివారా లు వస్తే పేదల ఇళ్లను కూలగొట్టే హైడ్రా, మరి రూ.7 వేల కోట్ల కుంభకోణాన్ని ఎందు కు ఆపడం లేదని నిలదీశారు. చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్ రెడ్డికి నాదర్‌గుల్ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు. అక్కడి 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మ కుంట (ఎఫ్‌టీఎల్), ఆరు ఎకరాల బఫర్ జోన్ ఉందని, సదరు చెరువుకు వచ్చే ఫీడర్ ఛానళ్లన్నీ కొన్ని కంపెనీలు ధ్వంసం చేశాయని వెల్లడించారు.

లచ్చమ్మ కుంట జలాలతో నిండితే, అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డికుంట, సున్నంచెరువు, చివరకు ఇంజాపూర్ మాసం చెరువు వరకు జలాలు చేరతాయని, ఇంత జరుగుతున్నా హైడ్రా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సోమవారం ఉదయం కల్లా హైడ్రా అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోకపోతే, మర్నాడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తామే అక్కడికి వెళ్తామని హెచ్చరించారు.

అక్కడ ఉన్న 80  ఎకరాల గుట్టలను, 12 ఎకరాలు లింగమయ్య గుట్ట మినహా మిగతాదంతా కబ్జాదారులు మింగేశారని, హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. ప్రతిపక్షాలపై సిట్స్ వేసే సీఎం రేవంత్ రెడ్డి ఈ కబ్జాలపై ఎందుకు మాట్లాడరు? అని మండిపడ్డారు. కంపెనీల కబ్జాల వెనుక సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

సదరు కంపెనీలు ఇప్పటికే భూముల చుట్టూ ఫెన్సింగ్ వేశాయని, బోర్డులు సైతం పెడుతున్నాయని తెలిపారు. ముందు కోహినూర్ గ్రూప్ బోర్డులు ఉండేవని, తర్వాత శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ అంటూ, మార్చి మార్చి బోర్డులు పెడుతున్నారని వివరించారు. కంపెనీస్ యాక్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్‌ఎల్‌పీల్లో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి, లోహిత్‌రెడ్డి, స్వప్నారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు.

అలాగే మున్సిపల్ కమిషనర్‌కు కాంపౌండ్ వాల్ కోసం దరఖాస్తు చేసిన ఎం/ఎస్ ఏక్యూ స్కేర్ రియ ల్టర్స్‌కు చెందిన క్రిస్టల్ మాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని, దీన్నిబట్టి సదరు కంపెనీ ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయేనని తేలిపోయిందన్నారు. ఒక రెవెన్యూశాఖ మం త్రి కుటుంబ సభ్యులే కబ్జాల వెనుక ఉంటే, ఇక ఆర్డీవో, హైడ్రా వంటి చిన్న అధికారులు వారిని ఎలా అడ్డుకుంటారని వాపోయారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం హైడ్రాను నాదర్‌గుల్‌కు పంపించి, అక్రమ కాంపౌండ్ వాల్‌ను కూలగొట్టాలని డిమాండ్ చేశారు.